
కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి
సురక్షితంగా బయటపడ్డ మరో ముగ్గురు
రేపల్లె రూరల్: పెనుమూడి వద్ద కృష్ణా నదిలో మునిగి ఇరువురు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భట్టిపోలు మండలం వేమవరం గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు ఆటోలో రేపల్లె మండలం పెనుమూడి వద్ద కృష్ణా నదికి చేరుకున్నారు. మతమార్పిడి కోసం ముగ్గురు రాగా వారి వెంట కుటుంబ సభ్యులు తరలివచ్చారు. వారిలో సరదాగా ఈత వేసేందుకు ఐదుగురు నదిలో దిగి నీట మునగగా గమనించిన స్థానికులు ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ఇద్దరిని నదిలో గాలించి కొంతసేపటికి ఒడ్డుకు తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఇరువురు యువకులను అంబులెన్‌న్స్‌లో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మార్గంలో ఒక యువకుడు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు. గుంటూరులో ఇంటర్ పూర్తి చేసిన తలకాయల గౌతం (18), పొన్నూరులో పాలిటెక్నిక్ పూర్తి చేసిన పెనుమాల దేవదాసు (19)లు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీనివాసరావులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు.