ది గోట్ లైఫ్
సాక్షి, పార్వతీపురం మన్యం: కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి.. ఏజెంట్ చేతిలో మోసపోయి, అక్కడ అరబ్బుల చేతిలో చిత్రవధకు గురైన ఓ నజీబ్ కథ... ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). ఓ నవల ఆధారంగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ కదిలించింది. కథలో కొద్దిగా మార్పులున్నా.. అటువంటి పరిస్థితినే అనుభవించాడు అప్పారావు అనే ఓ వ్యక్తి. ప్రస్తుతానికై తే అతనిది పార్వతీపురంగానే చెబుతున్నాడు. పేరు, ఊరు అయితే గుర్తుంది గానీ.. అంతకుమించి వివరాలేవీ చెప్పలేకపోతున్నాడు. దీంతో స్వస్థలానికి తిరిగి చేరుకోలేకపోతున్నాడు. ఇటీవలే తమిళనాట వెట్టిచాకిరీ నుంచి బంధవిముక్తుడైన అతని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కార్మిక శాఖాధికారుల చొరవతో
బంధవిముక్తి..
అక్కడి జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా కొద్దిరోజుల కిందట కదంబంకుళం వెళ్లారు. అక్కడ గొర్రెలు మేపుతూ అప్పారావు కనిపించాడు. ఆరా తీయగా.. తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడినని, తన గ్రామానికి వెళ్లకుండా 20 ఏళ్లకుపైగా అక్కడే పశువులను మేపుతున్నానని వివరించాడు. అప్పారావు దీనస్థితికి చలించిన కార్మిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిముత్తు.. తక్షణమే అతనిని విడిపించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 20 ఏళ్ల వెట్టిచాకిరీ నుంచి బంధ విముక్తుడయ్యాడు.
పార్వతీపురమే గానీ..
20 ఏళ్లు అయిపోవడం.. అప్పటి నుంచి తనతో తెలుగు మాట్లాడేవారు ఎవరూ సరిగ్గా లేకపోవడమో ఏమో గానీ.. పేరు కోనేరు అప్పారావు అని, ఊరు విజయనగరం జిల్లా పార్వతీపురం (అప్పట్లో ఉమ్మడి జిల్లా) అని మాత్రమే అక్కడి అధికారులకు చెప్పగలుగుతున్నాడు. తమిళం, తెలుగు కలిపి మాట్లాడటం వల్ల అధికారులూ పూర్తి వివరాలను తెలుసుకోలేకపోతున్నారు. ఎలాగైనా తనను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని ఆయన ప్రాథేయపడటంతో, అక్కడి శివగంగ జిల్లా కలెక్టర్.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్‌ను ఇటీవల ఫోన్‌లో సంప్రదించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం జిల్లా అధికారులు గ్రామంలో సంప్రదించి, ఫొటో చూపించినా.. ఎవరూ గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అప్పారావు అక్కడే పునరావాస కేంద్రంలో ఉన్నాడు.
అప్పారావు కుటుంబ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం..
– ఎ.శ్యామ్‌ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం
20 ఏళ్ల కిందట టీ తాగేందుకు దిగి...
సుమారు 20 ఏళ్ల కిందట అప్పారావు అనే వ్యక్తి పనుల కోసమని కొంతమందితో కలిసి పాండిచ్చేరి బయల్దేరాడు. మార్గమధ్యంలో టీ కోసం రైల్వే స్టేషన్‌లో దిగాడు. ఆయన మరలా రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. భాష రాదు, ఎటు వెళ్లాలో తెలియదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడే కొన్నాళ్లు చిక్కుకుపోయాడు. చివరికి కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నాడు. శివగంగ జిల్లాలోని కలైయార్కోయిల్ తాలూకా కదంబంకుళం ప్రాంతంలో అన్నాదురై అనే వ్యక్తి మాటలు నమ్మి, బతుకుదెరువు కోసం అక్కడ పనికి కుదిరాడు. నాటి నుంచి గొర్రెల కాపరిగా అక్కడే మగ్గిపోయాడు. పని చేసిన కాలానికి రూపాయి కూడా జీతం లేదు. వెట్టిచాకిరీ తప్ప. ఎటు వెళ్లాలో తెలియదు. ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలోనే 20 ఏళ్లు గడిచిపోయాయి. సొంత ఊరికి వెళ్లిపోతానని, ప్రయాణానికి డబ్బులు కావాలని ఎన్నోసార్లు యజమానికి ప్రాథేయపడినా.. ఫలితం లేకపోయింది.
ఇదో తరహా ‘ఆడు జీవితం’ కథ..
20 ఏళ్లుగా తమిళనాట మగ్గిపోతున్న ఓ వృద్ధుని కన్నీటిగాథ
గొర్రెల కాపరిగా వెట్టిచాకిరీ
ఇటీవలే బంధవిముక్తి
కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అక్కడి వారి ప్రయత్నం
పార్వతీపురం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ, తమిళనాడుకు చెందిన అన్నాదురై దగ్గర గొర్రెల కాపరిగా పని చేస్తున్నట్లు తమిళనాడు కార్మిక శాఖ అధికారులు గుర్తించారు. అప్పారావు చెబుతున్న ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉన్నట్లు ఆయన చెబుతున్న వివరాలు ఆధారంగా తెలుస్తోంది. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కూడా వాటిని పరిశీలించాలని ఆదేశించాం. ఆయన కుటుంబ ఆచూకీ లభ్యమైతే సమాచారాన్ని ఫోన్ 83338 13243 నంబరుకు తెలియజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment