అమ్మా..కరుణించమ్మా
● అనుబంధ అమ్మవార్ల దర్శనానికి
పోటెత్తిన భక్తులు
● పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు
● కోటదుర్గమ్మ, సంతానలక్ష్మి, అసిరితల్లి, భాగిరేతమ్మ ఆలయాల్లో సందడి
చీపురుపల్లి: భక్తుల కష్టాల్లో తోడుంటూ ఆదుకునే అమ్మా కరుణించండి అంటూ పట్టణంలోని అనుబంధ అమ్మవార్లను భక్తులు వేడుకున్నారు. పసుపు, కుంకుమలతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. తమ కష్టాలు తొలగించండి తల్లీ అంటూ చీరలు చూపిస్తూ అమ్మవార్లకు భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో పట్టణంలో అనుబంధ అమ్మవార్లుగా చెప్పుకునే శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ అసిరితల్లి, శ్రీ భాగిరేతమ్మ ఆలయాల్లో భక్తుల సందడితో పాటు ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది. సంప్రదాయం ప్రకారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అక్క, చెల్లెళ్లుగా చెప్పుకునే అనుబంధ అమ్మవార్లుగా పట్టణంలో ఉన్న శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ సంతోషిమాత, శ్రీ అసిరితల్లి, శ్రీ భాగిరేతమ్మ అమ్మవార్లకు కనక మహాలక్ష్మి జాతర ఉత్సవాల్లో ఆఖరి రోజు భక్తులు ప్రత్యేక పూజలతో బాటు మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మ, సంతానలక్ష్మి, అసిరితల్లి, భాగిరేతమ్మ అమ్మవార్ల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలో బారులు తీరారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్న మాదిరిగానే పసుపు, కుంకుమలతో పాటు చీరలు మొక్కుతూ తమ కష్టాలు నెరవేర్చాలని అనుబంధ అమ్మవార్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తగవిడివీధిలో గల శ్రీ కోటదుర్గమ్మ వారి ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూనే వేపచెట్టు వద్ద పూజలు చేశారు. అలాగే శ్రీ సంతోషిమాత, భాగిరేతమ్మ, అసిరితల్లి ఆలయాల వద్ద భక్తులు తులసి కోటకు పూజలు చేసి అమ్మవారిని వేడుకున్నారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మవారి ఆలయం వద్ద దర్శనానికి వచ్చే భక్తుల కోసం సిటీకేబుల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, కుమారుడు డా.బొత్స సందీప్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, డా.బొత్స సందీప్‌లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాలు నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment