8 నుంచి పీ–4 సర్వే చేపట్టాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో పీ–4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్) సర్వేను మార్చి 8 నుంచి పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మార్చి 7వ తేదీన సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి 8వ తేదీ నుంచి ప్రారంభించి వారంలోగా సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా 2లక్షల 65వేల గృహాలకు సర్వే చేయాల్సి ఉందని, కావున ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వ్మ్యాం(పీ–4)తో సర్వే, ఉపాధిహామీ, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీ–4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి జీవన ప్రమాణాలలో అట్టడుగు స్థాయిలో గల 20శాతం మంది నిరుపేదలను గుర్తించాల్సి ఉందన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారి సహకారంతో అట్టడుగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీససౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పీ–4 విధానం ప్రభుత్వం అవలంభించనుందని చెప్పారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో ఈ సర్వేను చేపట్టాలని, ఒక్కొక్కరూ కనీసం 90 వరకు సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
తాగునీటి ఎద్దడి ఉండరాదు
వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి మస్య ఉండరాదని, జూన్ మాంసాంతం వరకు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా బోర్లు మంజూరై ఉంటే వాటిని వేయించుకోవాలని లేదా జిల్లా పరిషత్ నుంచి నిధులు పొంది పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య వచ్చే జూన్ మాసాంతం వరకు తలెత్తరాదని తెల్చిచెప్పారు. భవిష్యత్‌లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
మార్చి 20లోగా ఉపాధి పనుల పూర్తి
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 215కోట్లు జిల్లాకు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.158 కోట్ల మేర పనులు పూర్తి చేశారని, మరో రూ.28కోట్ల మేరకు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన నిధులకు సరిపడా పనులను మార్చి 20వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మినీ గోశాలలు నిర్మాణాల కోసం చాలామంది కోరుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్. మన్మథరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, పరిశ్రమల కేంద్ర జిల్లా మేనేజర్ ఎంవీ కరుణాకర్, జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎన్. తిరుపతినాయుడు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, డీఎల్డీఓ రమేష్ రామన్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ రాజ్, మున్సిపాల్టీల డీఈఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment