అంగరంగ వైభవంగా... పోలిపల్లి పైడితల్లమ్మ జాతర
● వేలాదిగా తరలివస్తున్న భక్తులు ● మూడు రోజుల పాటు నిర్వహణ ● సేవా కార్యక్రమాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు
400 మంది సిబ్బందితో
బందోబస్తు
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామని చీపురుపల్లి డీఎస్సీ ఎస్.రాఘవులు అన్నారు. జాతరను పర్యవేక్షించేందుకు 27 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్స్ సహాయంతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
సేవా కార్యక్రమాల్లో సంస్థలు
రాజాం పట్టణానికి చెందిన సత్యసాయి సేవా సంస్థలు, వాసవీ క్లబ్ సభ్యులు, రెడ్ క్రాస్ బృందంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు ప్రారంభించాయి. రాజాం పట్టణం జాతర సందర్భంగా కళకళలాడుతోంది. ఆలయ ఆవరణలో విద్యుత్ దీపాలంకరణ కనువిందు చేస్తుంది.
రాజాం/రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పేరొందిన రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ 99వ జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జాతరలో తొలి రోజు నుంచే పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులతో బొబ్బిలి రోడ్డులో జనసందోహం నెలకొంది.
అమ్మవారి కొలువు ఇలా...
పట్టణ పరిధిలోని కొండంపేట గ్రామానికి చెందిన లంకలపల్లి వంశీకులు వెంకప్ప ఒకనాడు విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో యాత్రకు కుటుంబంతో వెళ్లాడు. జాతరను చూసి తిరిగి వస్తుండగా కొంతదూరం వచ్చేసరికి ఎవరో బండి ఎక్కినట్లు, బండి బరువెక్కి ఎడ్లు లాగడానికి కష్టంగా తోచడంతో వెనుదిరిగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అలాగే ఆ చీకటిలో ప్రయాణం చేసి కొండంపేట పరిసరాలకు వచ్చేసరికి ఎవరో బండిపై నుంచి కిందకు దూకినట్లు గజ్జల ధ్వని వినిపించింది. ఇంతలో నేను పైడితల్లిని పోలిపల్లి నుంచి నీ బండిపై వచ్చాను. ఈ పనస చెట్టుపై కొలువుంటానని పలికినట్లు ఆయనకు వినిపించింది. వెంకప్ప అమ్మవారిని భక్తితో నమస్కరించి ఇంటికి చేరుకొని ఈ విషయాన్ని బంధుమిత్రులకు చెప్పగా అప్పటి నుంచి అమ్మవారు కొలువున్న పనస చెట్టు ఆయన వంశీకులు, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారు పసుపు కుంకుమలు ఇచ్చి పూజించడం ప్రారంభించారు.
నమ్మకం ఇలా..
రాజాం పట్టణానికి చెందిన వ్యాపారి వాకచర్ల మల్లయ్య కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని తరచు పార్వతీపురం కోర్టుకు వెళ్తుండేవారు. కేసులు ఎంతకీ తేలక నష్టాల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో అమ్మవారు కళలో కనిపించి పనస చెట్టు వద్ద తనకు గుడి కట్టించమని కోరింది. మరునాడు ఆయన కోర్టు వ్యవహారాలపై పార్వతీపురం వెళ్తూ అమ్మవారికి నమస్కరించి కోర్టు వ్యవహారంలో జయం కలిగితే తప్పకుండా ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోర్టు వ్యవహారంలో గెలవడమేకాక దొంగలపాలైన అతని ధనం తిరిగి లభించింది. ఆ సంతోషంతో అమ్మవారిని దర్శించి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించారు. తన స్నేహితులైన పీసపాటి సత్యన్నారాయణాచార్యులు, పొట్టా సత్యన్నారాయణ, సలాది వెంకటప్పడు, గుడివాడ పెంటయ్య సహాయంతో వాస్తు పండితుడైన మజ్జి రమణయ్య సూచనలతో 1926లో ఆలయ నిర్మాణం మొదలు పెట్టి 1927 నాటికి పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఫాల్గుణమాసం శుక్లపక్షంన పౌర్ణమి ముందు వచ్చే ఆది, సోమ, మంగళవారాల్లో అమ్మవారి జాతర అత్యంత వైభవంగా రాజాంలో జరుగుతుంది.
అంగరంగ వైభవంగా... పోలిపల్లి పైడితల్లమ్మ జాతర
అంగరంగ వైభవంగా... పోలిపల్లి పైడితల్లమ్మ జాతర
Comments
Please login to add a commentAdd a comment