పార్వతీపురం టౌన్: ఉల్లాస్ అక్షరాస్యత అర్హత పరీక్షను ఈ నెల 23న నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో శుక్రవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో 2024 నవంబర్ 15వ తేదీ నుంచి 22,944 మంది వయోజనులకు 2,294 మంది వలంటీర్లతో చదవడం, రాయడం, చిన్నచిన్న లెక్కలు చేయగలగడం నేర్పించామని, వారి అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడమే ‘ఉల్లాస్’ ఉద్దేశంగా పేర్కొన్నారు. చదివేందుకు 50, రాయడానికి 50, గణితానికి 50 మార్కుల చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంద న్నారు. ఇందులో 33 శాతం మార్కులు పొంది న వారిని ఉత్తీర్ణులుగా గుర్తించి ఎన్‌ఐఔస్ ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.
బిత్రపాడులో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని నిమ్మలపా డు, బిత్రపాడు పంట పొలాల్లో శుక్రవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. నిమ్మలపాడు దగ్గర నాగావళి నదిలో ఉన్న ఏనుగులు సాయంత్రానికి బిత్రపాడు పొలిమేరకు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరి, అరటిపంటలు ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఫారం పాండ్స్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఫారంపాండ్స్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. పల్లె పండగ కార్యక్రమంపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శుక్రవారం సమీక్షించారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్‌తో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం మండల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పల్లె పండుగ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రక్తహీనత కేసులు తగ్గుముఖం
విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వం రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో సమర్ధంగా అమలుచేస్తుండడంతో రక్తహీనత కేసులు తగ్గుముఖంపట్టాయని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ దృష్టిశర్మ, డాక్టర్ జాస్మిన్ అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రక్తహీనత తగ్గడానికి గల కారణాలపై ఆధ్యయనం చేశారు. సంబంధిత అంశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కలిసి వివరించారు. ఎనిమీయా ముక్త్ భారత్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయగ్రామీణ జీవనోపాదుల కార్యక్రమాలు రక్తహీనత తగ్గించేందుకు దోహదపడుతున్నాయన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాంలోని 12 జిల్లాల్లో రక్తహీనత తగ్గుదలకు గల కారణాలపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవన రాణి పాల్గొన్నారు.
23న ఉల్లాస్ అర్హత పరీక్ష
23న ఉల్లాస్ అర్హత పరీక్ష
23న ఉల్లాస్ అర్హత పరీక్ష