నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాల్సిందే..
గోదావరిఖని: రక్షణతో కూడిన వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిందేనని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) బలరాం సూచించారు. డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీ, జీడీకే–11గనిని గురువారం సీఎండీ సందర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఉద్యోగులు ఎనిమిది గంటలపాటు విధులు నిర్వహించాలన్నారు. భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని అన్నారు. కాలం చెల్లించిన యంత్రాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడంలో ప్రతీఒక్కరు పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. గైర్హాజర్ లేకుండా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా సూపర్వైజర్లు, మైనింగ్ సిబ్బంది, కోల్‌కట్టర్, సపోర్ట్‌మెన్‌తోపాటు కంటిన్యూస్ మైనర్ ఆపరేటర్లు తదితరుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సేఫ్టీ జీఎం గుపాత, క్వాలిటీ జీఎం భైద్యా, ఏజెంట్ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, ఏసీఎంవో కిరణ్ రాజ్‌కుమార్, డీజీఎం(పర్సనల్) కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
లాభాలు సాధిస్తేనే మనుగడ
సింగరేణి సీఎండీ బలరాం
Comments
Please login to add a commentAdd a comment