బోనస్ పడలే..
జిల్లాలో సన్నరకం ధాన్యం సేకరణ వివరాలు
కొనుగోలు చేసిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 2,29,443.96
విక్రయించిన రైతుల సంఖ్య : 37,752
చెల్లించాల్సిన బోనస్ మొత్తం (రూ.కోట్లలో) 114.72
రైతుల ఖాతాల్లో జమైన సొమ్ము(రూ.కోట్లలో) 106.71
బోనస్ అందని రైతుల సంఖ్య: 3,142
జమకావాల్సిన సొమ్ము(రూ.కోట్లలో): 8.01
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతోపాటు అదనంగా రూ.500 బోనస్ వర్తింపజేస్తామనే ప్రకటన అప్పట్లో రైతుల్లో అనేక ఆశలు రేకెత్తించింది. ఇచ్చిన హామీ అమలులో భాగంగా గత వానాకాలం సీజన్‌లోనే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని వెల్లడించింది. తన హామీ మేరకు వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు క్వింటాలు కు రూ.2,320 మద్దతు ధరతోపాటు, రూ. 500 బోనస్ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో చాలామంది రైతులు సన్నరకం వడ్లు సాగు చేసేందుకే మొగ్గుచూపారు. అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి సన్నవడ్లు పండించారు. ఆ తర్వాత బహిరంగ మార్కెట్‌లో సన్నవడ్లకు డిమాండ్ అధికంగా ఉన్నా.. తమకు బోనస్ లభిస్తుందనే ఆశతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్నరకం వడ్లు విక్రయించారు. కానీ, సన్నరకం ధాన్యం విక్రయించిన నెలలు గడుస్తున్నా తమ బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు జమకాలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బోనస్ డబ్బులు చేతికి అందితే యాసంగి పంటల సాగు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని, ఇది తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని ఆశపడుతున్నారు. అంతేకాదు.. బోనస్ డబ్బుల కోసం ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. మరికొందరు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదోనని సరిచూసుకుంటున్నారు.
కష్టమైనా సన్నవడ్లే సాగు చేశారు..
జిల్లాలో గత వానాకాలంలో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దొడ్డురకం కన్నా.. సన్నరకం వడ్లు సాగు చేయడానికి కష్టాలు ఎక్కువే. సహజంగా దొడ్డురకం పంట కాలం 135 రోజుల వరకు ఉంటే, సన్నవడ్లు 165 రోజుల వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఫలితంగా నెలరోజుల పాటు రైతులు అదనంగా శ్రమించాల్సి వస్తోంది. పెట్టుబడి సైతం సాధారణ రకాలతో పోల్చి చూస్తే సుమారు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అధికమవుతోంది. చీడపీడలు సోకే ప్రమాదం కూడా ఎక్కువే ఉన్నా.. ఆ మేరకు రావాల్సిన దిగుబడి.. తక్కువగా రావడం రైతులను ఇబ్బందులకు గురిచేసే అంశమేనని పేర్కొంటున్నారు. అయినా, వ్యయప్రయాసాలకు ఓర్చి సన్నాలు సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. కానీ, సుమారు రెండున్నర నెలలు గడిచినా బోనస్ డబ్బులు పడక చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిషయమైన సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. రైతుల వివరాల జాబితాను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయని ఆయన వెల్లడించారు.
డిసెంబర్‌లో అమ్మిన
గత డిసెంబర్‌లో మా గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లను విక్రయించా. 112 బస్తాల ధాన్యం అమ్మిన. వాటికి సంబంధించిన మద్దతు ధర డబ్బులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కానీ, క్వింటాలుకు ఇస్తానన్న రూ.500 బోనస్ డబ్బులు ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలో పడలేదు. బోనస్ దాదాపు రూ.22,500 జమకావాల్సి ఉంది.
– దారవేణి శ్రీనివాస్, రైతు, పాలకుర్తి
వ్యాపారులకు విక్రయించలే
మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో రెండు నెలల క్రితం జైశ్రీరామ్ సన్నవడ్లు విక్రయించిన. బోనస్ పైసలు క్వింటాలుకు రూ.500 ఇస్తున్నారని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. బయట మార్కెట్‌లో క్వింటాలుకు రూ.2,800 చొప్పున ధర చెల్లిస్తామని వ్యాపారులు చెప్పినా నేను అమ్మలేదు. తీరా చూస్తే సన్నవడ్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ పడలేదు.
– దాడి సదయ్య, రైతు దొంగతుర్తి
బోనస్ పడలే..
బోనస్ పడలే..
Comments
Please login to add a commentAdd a comment