
ఆశలు.. అడియాసలు..!
● జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఎప్పుడు? ● మామునూర్‌లో గ్రీన్‌సిగ్నల్‌తో జిల్లావాసుల్లో జోరందుకున్న చర్చ ● అందుబాటులో అంతర్గాం టెక్స్‌టైల్ మిల్లు ఖాళీ భూములు ● రాష్ట్ర, దేశ రాజధానులతో రోడ్లు, రైల్వే మార్గాల కనెక్టివిటీ ● సానుకూలాంశాలు పరిశీలించాలంటున్న జిల్లావాసులు
రామగుండం: టీటీఎస్ అంతర్గాం టెక్స్‌టైల్‌శాఖకు చెందిన వందలాది ఎకరాల భూముల్లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు స్థాపించేందుకు సుమారు మూడు నెలల క్రితం జరిగిన పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాంకేతికపరమైన సమస్యలు ఉండడంతో ప్రత్యామ్నాయంగా అంతర్గాం టెక్స్‌టైల్ భూములను ఎంచుకున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అందుకు సానుకూలంగా స్పందించింది. దీంతో అంతర్గాం పేరు దేశ వ్యాప్తంగా అప్పట్లో మార్మోగింది.
ప్రభుత్వానికి నివేదిక అందజేసినా..
టెక్స్‌టైల్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సత్వరమే అందజేయాలని అంతర్గాం తహసీల్దార్, పెద్దపల్లి ఆర్డీవోలను కలెక్టర్ కోయ శ్రీహర్ష అప్పట్లోనే ఆదేశించారు. దీంతో వారంలోపే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టిన అధికారులు.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అప్పటి నుంచి నేటివరకు ఆ భూములపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. రెండు రోజుల క్రితంఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూర్‌లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, మన జిల్లాలోని అంతర్గాంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లావాసులు నిరాశకు గురవుతున్నారు.
రెండు ప్రాంతాల్లో ప్రతిపాదనలు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కి.మీ. దూరంలో మరో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉంది. అయితే, మామునూర్ విషయంలో పౌర విమానయాన సంస్థ ఈ నిబంధన సడలించిందని, అందుకే అక్కడ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఇలాంటి నిబంధనలు ఏమీలేవని, అందుకే ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సానుకూల అంశాలే ఉంటాయని కొందరు అధికారులు వివరిస్తున్నారు. మామునూర్ విషయంలో 150 కి.మీ. నిబంధన సడలింపులో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 1930లో అప్పటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎయిర్‌పోర్టును ప్రారంభించారని, ఆ తర్వాత 1981 వరకు మామునూర్ కేంద్రంగా వివిధ వర్గాల వారు విమాన సేవలను వినియోగించుకున్నారని అంటున్నారు. అప్పటి పరిశ్రమల అవసరాల కోసం వరంగల్ జిల్లా కేంద్ర బిందువుగా ఉండడంతో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైందని వారు వివరిస్తున్నారు.
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అంతేనా?
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కి.మీ. దూరంలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయ కూడదనే పౌర విమానయాన నిబంధన అంతర్గాం విషయంలో వర్తించే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 220 కి.మీ.లకుపైగా దూరంగానే అంతర్గాం ఉంటుంది. దీంతో ఆ నిబంధన అమలు చేసినా విమానాశ్రయం ఏర్పాటుకు అడ్డురాదంటున్నారు. దీంతోనే జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి.
మామునూరుకూ 150 కి.మీ.లకుపైగా దూరంలో..
మామునూరులో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టుకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం/బసంత్‌నగర్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టుకు మధ్య సుమారు 150 కి.మీ.లకు పైగానే దూరం ఉంటుంది. రామగుండం పరిశ్రమల స్థాపనకు నిలయంగా ఉంది. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రాష్ట్ర రాజధానిని అనుసంధానిస్తూ రాజీవ్ రహదారి ఉంది. దేశరాజధానితో రైలు మార్గం కనెక్టివిటీ కూడా ఉంది. దీంతో జిల్లాలో ఎయిర్‌పోర్టుకు అన్నీ అనుకూలాంశా లు ఉన్నాయని, తద్వారా ఎయి ర్‌పోర్టు ఏర్పాటును వేగవంతంగా పరిశీలించాలని జి ల్లావాసులు కోరుతున్నారు.
స్పష్టత
రాలేదు
అంతర్గాం టెక్స్‌టైల్ భూముల వివరాలపై నివేదిక ఇవ్వాలని రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సర్వేచేసి పూర్తివివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అక్కడి నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాధానం రాలేదు. భూముల్లో పరిశ్రమల స్థాపనకు సర్కారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భూ వివరాలు సమర్పించడం వరకే మా బాధ్యత ఉంటుంది. మిగతా అంశాల్లో మా ప్రమేయం ఏమీ ఉండదు.
– గంగయ్య, ఆర్డీవో, పెద్దపల్లి

ఆశలు.. అడియాసలు..!
Comments
Please login to add a commentAdd a comment