
అప్రమత్తతతోనే ఆరోగ్యం
కోల్‌సిటీ(రామగుండం): మార్చి ఆరంభంలోనే భానుడు సెగలు కక్కుతున్నాడు.. పగటిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరిగి జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత పెరిగి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ ప్రకటించింది. ఏప్రిల్, మేలో గరిష్టంగా 44 నుంచి 46 సెల్సియస్ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కన్నా 2 సెల్సియస్ డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ జనరల్ ఫిజీషియన్(ఎండీ) డాక్టర్ స్వప్నలత వెల్లడించారు. ఎండల తీవ్రత, వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘సాక్షి’: వడదెబ్బకు గురైతే ఏం చేయాలి?
డాక్టర్: వడదెబ్బకు గురైన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. నీడకు తరలించాలి. చల్లని నీటిలో తడిపిన బట్టతో ఒళ్లంతా తుడవాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ గాలి ఉంటే పెట్టాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ప్రథమ చికిత్స తర్వాత సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలి. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇస్తే సిబ్బంది కూడా ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలిస్తారు.
‘సాక్షి’: తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
డాక్టర్: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో ఉన్నా, బ యటకు వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు పూర్తిచేసుకోవాలి. ఎండలో బయటకు వెళ్తే విధిగా గొడుగులు, తలకు టోపీ, కూలింగ్ గ్లాస్, చేతిరుమాలు ధరించాలి. విధిగా వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలి. తెల్లని దుస్తులు, లైట్‌కలర్ కాటన్ దుస్తులు ధరించడం మంచిది. వేసవి పూర్తయ్యే వరకూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
●
ఈసారి ఎండల తీవ్రత అధికం జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘సాక్షి’తో జీజీహెచ్ ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ ఫిజీషియన్ స్వప్నలత
సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు?
డాక్టర్: భరించలేని ఉష్ణతాపం, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి వాతావరం వేడెక్కడం. ఎండలు ఎక్కువైనప్పుడు, తీవ్ర వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రమాదకరమైనది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పని చేయకపోవడంతో వడదెబ్బకు గురవుతారు. వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారన్ హీట్స్ కన్నా ఎక్కువ ఉంటే వడదెబ్బకు గురైనట్లు భావించాలి. తద్వారా వ్యక్తి చాలా బహీనమవుతారు.
‘సాక్షి’: వడదెబ్బ లక్షణాలు..?
డాక్టర్: తీత్రమైన తలనొప్పి, తల తిప్పడం, నాడీ వేగంగా కొట్టుకోవడం, నాలుక తడి ఆరిపోయి ఎండిపోవడం, శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోవడంతో పేషెంట్ అపస్మారక స్థితికి చేరుకుంటారు.
‘సాక్షి’: ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్: బయటికి వెళ్లి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్, శీతలపానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జ్యూస్, మజ్జిగ, నిమ్మరసం తయారు చేసుకుని తాగాలి. ఇంట్లో తయారు చేసుకున్న సీజనల్ పండ్ల రసాలు తీసుకోవాలి. కొబ్బరినీరు తాగాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు పూర్తిగా నిషేధించాలి. మద్యం తాగడాన్ని మానేయాలి. తరచూ నీటిని తాగుతూ ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

అప్రమత్తతతోనే ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment