ఆర్టీసీకి కలిసొచ్చిన ‘మహా’ జాతర
● సిరిసిల్ల, వేములవాడ డిపోలకు రూ.27.21 లక్షలు..
● గతేడాది కంటే ఈసారి పెరిగిన ఆదాయం
వేములవాడఅర్బన్: ఆర్టీసీకి మహాశివరాత్రి జాతర కలిసొచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో జరిగిన ఉత్సవాలకు వేములవాడ, సిరిసిల్ల డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో 24 గంటలు రాజన్న భక్తులను బస్సులు వారి ఇంటికి చేరవేశాయి. మూడు రోజులపాటు ఆర్టీసీ సిబ్బంది తమకు కేటాయించిన డిపోల్లో పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు నడిపించి ఇబ్బంది కలగకుండా చూశారు. కాగా ఈసారి వేములవాడ, సిరిసిల్ల డిపోలకు రూ.27,21,000 ఆదాయం సమాకూరింది. గతేడాది రూ.22,80,000 సమాకూరగా, ఈసారి రూ.4,41,000 ఆదాయం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మూడురోజులు.. 24 గంటలు
గత నెల 25,26,27వ తేదీల్లో వేములవాడ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు 24 గంటలు నడిచాయి. ఇక్కడి నుంచి జగిత్యాల, సికింద్రాబాద్, కరీంనగర్, సిరిసిల్లకు 26 బస్సులు నడిచాయి. మూడురోజుల ఆదాయం రూ.20,60,000 సమకూరింది. మూడు రోజుల పాటు బస్సులు 455 ట్రిప్పులు, 31 వేల కిలో మీటర్లు తిరిగి 27 వేల మంది ప్రయాణికులను చేరవేశాయి. గతేడాది మహాశివరాత్రికి రూ.19,11,000 ఆదాయం సమాకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అప్పటి కంటే ప్రస్తుతం రూ.1,49,000 ఎక్కువ ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.
సిరిసిల్ల డిపోకు..
మహాశివరాత్రి జాతరకు సిరిసిల్ల డిపో నుంచి 26 బస్సులు వేములవాడ– సిరిసిల్ల, వేములవాడ– వరంగల్‌కు నడిచాయి. మూడురోజుల ఆదాయం రూ.6,61,000 సమకూరింది. మూడు రోజుల పాటు 165 ట్రిప్పులు, 9,023 కిలో మీటర్లు నడిపి 14,269 మంది ప్రయాణికులను చేరవేశాయి. గతేడాది రూ.3,69,000 ఆదాయం సమకూరగా, ఈసారి రూ.2,92,000 ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
సిబ్బంది కృషితో..
వేములవాడలో జరిగిన మహాశివరాత్రి జాతరకు వేములవాడ, సిరిసిల్ల డిపోల్లోని ఉద్యోగుల సమష్టి కృషితో ఆర్టీసీకి ఆదాయం సమాకూరింది. ఆర్టీసీ సిబ్బంది మూడురోజుల పాటు రాత్రిపగలు కష్టపడి ప్రయాణికులను సరక్షితంగా చేరవేశారు. ఆర్టీసీని ఆదరించి బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులకు ధన్యవాదాలు.
– శ్రీనివాస్, డిపో మేనేజర్, వేములవాడ
ఆర్టీసీకి కలిసొచ్చిన ‘మహా’ జాతర
Comments
Please login to add a commentAdd a comment