మల్కాపూర్‌లో వ్యక్తి బలవన్మరణం
బోయినపల్లి(చొప్పదండి): చిట్టీ డబ్బులు కట్టేదెలా అనే మనస్థాపంతో మండలంలోని మల్కాపూర్‌కు చెందిన పబ్బల్ల కొమురయ్య(55) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు. కొమురయ్య మూడు నెలల క్రితం కులసంఘంలో రూ.30వేలు తీసుకున్నాడు. రెండు నెలలుగా డబ్బులు చెల్లించడం లేదు. ఈనెల 1న కులం చిట్టీ ఉండడంతో డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక మనస్థాపంతో శనివారం ఉదయం విద్యుత్ ఫోల్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. ఈమేరకు మృతుడి కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
చెరువులో పడి వృద్ధుడు మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పట్టణానికి చెందిన రాపల్లి రాజయ్య (88) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం.. కొత్తపల్లిలోని పోస్టాపీస్ సమీపంలో నివాసముండే రాజయ్య శుక్రవారం బహిర్భూమికి చెరువు సమీపంలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. రాత్రి అయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు సమీపంలో వెతకడంతో పాటు అక్కడున్న సీసీ కెమెరాల్లో పరిశీలించారు. చెరువు వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చెరువు వద్ద మృతుడి చెప్పులు, లుంగీ ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చెరువులో మత్స్యకారులతో గాలింపు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి..
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందిన ఘటన శనివారం జమ్మికుంటలో జరిగింది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు.. మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేని ప్రశాంత్(28) సొంత ట్రాక్టర్‌పై పని నిమిత్తం జమ్మికుంటకు వస్తున్న క్రమంలో మున్సిపల్ పరిధి ధర్మారం సమీపంలో ట్రాక్టర్ టైర్ పేలిపోయి కెనాల్ కాల్వలో బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న ప్రశాంత్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుడికి భార్య రమ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గురుకుల విద్యార్థి అదృశ్యం
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి మైస శివరాం అదృశ్యమయ్యాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. గోదావరిఖనికి చెందిన శివరాం గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం క్లాస్‌కు హాజరైన విద్యార్థి ఇంటర్‌వెల్ తర్వాత కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకి దొరకలేదు. బ్యాగు తీసుకొని వెళ్లిపోగా విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు కూడా ఇంటికి రాలేదని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కృష్ణమాచార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment