ఆలస్యంగా నడిచిన భాగ్యనగర్ రైలు
ఓదెల(పెద్దపల్లి): సికింద్రాబాద్ నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్ వెళ్లే భాగ్యనగర్ రైలు శనివారం చాలా ఆలస్యంగా నడిచింది. ఓదెలకు రాత్రి 6.50 గంటలకు రావాల్సిన రైలు.. సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొత్కపల్లి, ఓదెల, కొలనూరు రైల్వేస్టేషన్లలో రైలు దిగి సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు లభించక రాత్రంతా నిరీక్షించారు. రైలు ఆలస్యానికి గల కారణాలను రైల్వే అధికారులు వెల్లడించడం లేదు.
యూరియా ఉత్పత్తి వేగవంతం
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియా ఉత్పత్తి వేగవంతమైంది. ఈమేరకు ఫిబ్రవరి 2025లో 1,03,912.38 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశామని కంపెనీ సీజీఎం ఉదయ్ రాజహంస శనివారం తెలిపారు. కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాను 8 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ యూరియాలో అధిక శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన యూరియాలో తెలంగాణకు 58,063.32 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 29,545.11 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 10,685.79 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,618.16 మెట్రిక్ టన్నుల సరఫరా చేశామని ఆయన వివరించారు.
అత్తింటి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
వేములవాడ: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శనివారం వేములవాడ పట్టణ శివారులోని వ్యవసాయిబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలు.. వేములవాడ రూరల్ మండలం అచ్చనపల్లికి చెందిన కొక్కుల దేవరాజు కూతురు పల్లవిని పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మ్యాన శివుడికిచ్చి 2021లో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని పల్లవిని భర్త, అత్త విజయ, ఆడబిడ్డ లావణ్య, ఆడబిడ్డ భర్త రఘు వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక పల్లవి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి దేవరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment