10,530 మంది.. 23 కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

10,530 మంది.. 23 కేంద్రాలు

Published Wed, Mar 5 2025 1:15 AM | Last Updated on Wed, Mar 5 2025 1:11 AM

10,530 మంది.. 23 కేంద్రాలు

10,530 మంది.. 23 కేంద్రాలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 10,530 మంది ఇంటర్‌ విద్యార్థులు ఉండగా, వారికోసం 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించారు. మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. ఈసారి విద్యార్థుల హాల్‌టిక్కెట్లపైనే పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు వీలుగా ‘క్యూఆర్‌’ కోడ్‌ ముద్రించారు. పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. నిర్దేశిత గడువ ముగిశాక ఐదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అత్యవసర సేవల కోసం వైద్య సిబ్బందిని నియమించారు. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులు నడిపేలా అధికారులకు ఆదేశాలు జారీచేశాచ్చారు. విద్యుత్‌, మున్సిపల్‌, పోస్టల్‌ అధికారులు తమ వంతు విధులను నిర్వర్తిస్తూ పరీక్షలు సాఫీగా సాగేలా చూడాలని ఉన్నతాధికారులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.

10,530 మంది విద్యార్థులు..

జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 10,530 మంది ఉండగా, ఫస్టియర్‌లో 4,894 మంది (జనరల్‌ 3,826, వొకేషనల్‌ 1,068 మంది)విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 5,636 మంది(ఇందులో 4,550 మంది జనరల్‌, 1,086 మంది వొకేషనల్‌) విద్యార్థులు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 14 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలతోపాటు 07 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలు, ఓ మైనార్టీ, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీలు ఉన్నట్లు ఇంటర్‌ విద్య బోర్డు అధికారులు తెలిపారు.

క్యూఆర్‌ కోడ్‌తోపాటు యాప్‌..

ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రం చిరునామా చూపేలా ఈసారి హాల్‌టికెట్లపైనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. దీంతోపాటు లొకేటర్‌ యాప్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు సులువుగా పరీక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు ఇవి ఎంతో దోహదపడతాయని చెబుతున్నారు.

పరీక్ష కేంద్రాల సమీపంలో నిషేధాజ్ఞలు..

పరీక్ష కేంద్రాలకు సమీపంలో 144 సెక్షన్‌తోపాటు నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా ఉండకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిరాక్స్‌ సెంటర్లను మూసిఉంచేలా ఆదేశాలు జారీచేశారు.

సీసీ కెమెరాలు.. స్క్వాడ్‌తో నిఘా

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఇప్పటికే బిగించారు. అలాగే మాస్‌ కాపీయింగ్‌ నియంత్రణకు సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంలో సీనియర్‌ లెక్చరర్‌, డెప్యూటీ తహసీల్దార్‌, ఏఎస్సైలు ప్రతినిధులుగా ఉంటారు.

వసతుల కల్పన..

ఎండతీవ్రత పెరగడంతో పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించారు. వైద్యసిబ్బందిని(ఎఎన్‌ఎం, ఆశ వర్కర్‌, సూపర్‌వైజర్‌) అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.

జిల్లా సమాచారం

పరీక్షల నిర్వహణ ఈనెల 5 నుంచి 25 వరకు

మొత్తం విద్యార్థుల సంఖ్య 10,530

ఇందులో జనరల్‌ విద్యార్థులు 8,376

వొకేషనల్‌ విద్యార్థులు 2,154

ఇన్విజిలేటర్లు 250

సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 4

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 1

పరీక్ష కేంద్రాలు 23

ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష సమయం దాటిన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించేలా ఆదేశాలు అందాయి.

– కల్పన, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు

నిఘా నేత్రాల మధ్య పరీక్షల నిర్వహణ

ఈసారి విద్యార్థుల హాల్‌టికెట్లపైనే క్యూర్‌ కోడ్‌

ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement