హస్త వైఫల్యం! | - | Sakshi
Sakshi News home page

హస్త వైఫల్యం!

Published Fri, Mar 7 2025 9:25 AM | Last Updated on Fri, Mar 7 2025 9:21 AM

హస్త వైఫల్యం!

హస్త వైఫల్యం!

● ఎమ్మెల్సీ ఓటమిపై కాంగ్రెస్‌లో మొదలైన అంతర్మథనం ● చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాలలో ప్రతికూలం ● పెద్దపల్లి జిల్లాలోనే హస్తం పార్టీకి మెజారిటీ ● కరీంనగర్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌, ఎమ్మెల్సీల్లో వరుస ఓటమి ● కొంపముంచిన చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు ● పార్టీలో లోపాలపై ముఖ్యమంత్రికి త్వరలో నివేదిక ● నాటి సీఎం తరహాలోనే నేటి సీఎం వ్యాఖ్యలు చేటు చేశాయా?

ఎక్కడెక్కడ బలహీనం అంటే?

వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేతను ఎంపిక చేయడం లోకల్‌ పలువురు నాయకులకు నచ్చలేదు. కీలకమైన కరీంనగర్‌ నుంచి మరో నాయకుడు ఎదగడం తమ పార్టీలోనే ముగ్గురు ముఖ్యనేతలకు ఇష్టం లేదని ఓటమి అనంతరం నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. గెలవగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంతో కొందరు ముఖ్యనాయకులు పార్టీ ఎన్ని కల ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్‌, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగి త్యాల, ధర్మపురి, మానకొండూర్‌లో తక్కువ ఓట్లు వచ్చాయని సాక్షాత్తు నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చేందుకు నరేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

రీంనగర్‌– మెదక్‌– నిజామాబాద్‌– ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటమి కాంగ్రెస్‌ పార్టీలో భారీ కుదుపునకే దారి తీస్తోంది. పార్టీలో సమన్వయ లోపాలు, అనైక్యత, పరస్పర సహకారం కొరవడటం తదితర వైఫల్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు, 2025లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఇలా ఏడాదిన్నర కాలంలో కరీంనగర్‌లో కాంగ్రెస్‌ వరుసగా ఓడింది. కానీ, ఈసారి ఓటమిపై పార్టీలో ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది. వాస్తవానికి 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలలోని గ్రాడ్యుయేట్ల కోసం ఎన్నిక జరిగినా.. ప్రచారం, నామినేషన్‌, రాజకీయం అంతా కరీంనగర్‌ కేంద్రంగానే జరిగింది. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించడం, సిట్టింగ్‌ సీట్లో ఓటమిపై మునుపెన్నడూ లేని చర్చ నడుస్తోంది.

చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు

వాస్తవానికి నరేందర్‌రెడ్డికి తన ప్రత్యర్థి అంజిరెడ్డి(బీజేపీ)కన్నా కేవలం 5,106 ఓట్లు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 28,686 ఓట్లు చెల్లనివి వచ్చాయి. ఈ ఓట్లలో దాదాపు 16వేల ఓట్లు నరేందర్‌రెడ్డికే పడడం దురదృష్టకరం. అందులోనూ ఆరువేలకుపైగా ఓట్లు కేవలం అంకె ముందు సున్నా వేయడం వల్ల చెల్లకుండా పోవడం కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. అదే సమయంలో బీజేపీ జిల్లా, మండలం, గ్రామం, బూత్‌లెవల్‌వరకు పోల్‌ మేనేజ్మెంట్‌ను పకడ్బందీగా నిర్వహించింది. ప్రతీ 25మందికి ఒక ఇన్‌చార్జిని నియమించి, ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో క్యాడర్‌ సఫలీకృతమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరు, పోల్‌ మేనేజ్మెంట్‌ వైఫల్యాల కారణంగా ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో దెబ్బతిన్నారు. కొందరు కాంగ్రెస్‌ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థికి ఓట్లు వేయించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తుండటం గమనార్హం.

నాడు కేసీఆర్‌.. నేడు రేవంత్‌

కరీంనగర్‌ ఉద్యమాలకు, భావోద్వేగాలకు నిలయమైన జిల్లా. ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పులివ్వడంలో పరిపాటి. అందుకే, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాన్ని అందుకుని మంచి జోరు మీదున్న బీఆర్‌ఎస్‌కు మొదటి ఎదురుదెబ్బ కరీంనగర్‌లోనే తగిలింది. 2019 గ్రాడ్యుయేట్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించి బీఆర్‌ఎస్‌కే కాదు.. రాష్ట్ర రాజకీయాలకే కరీంనగర్‌ ఓటర్లు షాక్‌ ఇచ్చారు. ఇటీవల నరేందర్‌రెడ్డి కోసం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌ ఈ ఎమ్మెల్సీ గెలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం చర్చనీయాంశంగా మారాయి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌ బీజేపీని ఉద్దేశించి.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట వాడటం.. ఆ పార్టీ పరాజయంలో కీలకంగా పనిచేసిన విషయాన్ని కరీంనగర్‌ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement