దంతవైద్య దినోత్సవం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో గురువారం దంతవైద్య దినోత్సవాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి సిబ్బందిని సత్కరించారు. ఆసుపత్రిలో దంత వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు విజయ్, సుస్మిత, ఆర్‌ఎంవో, సీనియర్ డాక్టర్లకు అభినందనలు తెలిపారు.
నిండు గర్భిణికి శస్త్రచికిత్స
కాటారం మండలానికి చెందిన నిండు గర్భిణికి ప్లేట్‌లెట్స్ కేవలం 74వేలు మాత్రమే ఉన్నట్టు వైద్యులు గుర్తించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. దీంతో ఆమె బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించి కావాల్సిన జాగ్రత్తలతో గురువారం శస్త్రచికిత్స చేసినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యబృందాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారని తెలిపారు.
10న అప్రెంటిస్ మేళా
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 10న ఏ ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు. మేళాలో తోషిబా, ఎల్‌అండ్‌టీ, జాన్సన్ లిఫ్ట్‌స్ ఇండియా, టాటా ఏరోస్పేస్, వరుణ్‌మోటార్స్, ఆదర్శ మోటార్స్, రాజే ఇంజిన్‌వాల్వ్, ఐటీసీ టెక్నాలజీస్ తదితర కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అప్రెంటీస్ వెబ్‌సైట్‌లో తగిన ధ్రువపత్రాలతో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సోమవారం నిర్వహించే మేళాకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 99896 16132, 97031 13881 నంబర్లలో సంప్రదించాలన్నారు.
విద్యుత్ మీటర్ సీల్ తొలగిస్తే చర్యలు
పెద్దపల్లిరూరల్: విద్యుత్ వినియోగం కోసం ఏర్పాటు చేసుకున్న మీటర్లకు సంబంధిత అధికారులు వేసిన సీల్‌ను తొలగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎండీ బాబా అన్నారు. ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు విద్యుత్ వినియోగదారుల వద్దకు వచ్చి మీటరు తిరగకుండా చేసి విద్యుత్ వాడుకునేలా చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. సదరు వ్యక్తులు మీటరుకు అమర్చిన కొన్ని వైర్లను కత్తిరించినట్లు గుర్తించామని వివరించారు. మీటరు వైర్లను కత్తిరించడం, సీల్‌ను తొలగించడాన్ని నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీటరు తిరగకుండా చేస్తామంటూ వచ్చే అపరిచితులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
కోలిండియాలో మహిళా సంక్షేమ కమిటీ
గోదావరిఖని(రామగుండం): కోలిండియాలో మహిళా సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కోలిండియాలోని అన్ని సంస్థలకు ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారిత సాధించేందుకు ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ–7 గ్రేడ్ సీనియర్ ఉన్నతస్థాయి మహిళా ఎగ్జికూటివ్ అధికారిని ఆధ్వర్యంలో మహిళల సమస్యలు పరిష్కరించేందుకు పర్సనల్ విభాగం ద్వారా కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా ఈఉత్తర్వులను సింగరేణిలో వెంటనే అమలు చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment