ఎములాడ రాజన్న సేవలో..
వేములవాడ: దైవకార్యంలో మేము సైతం అంటూ మహిళలు ముందుకు సాగుతున్నారు. సొంత ఖర్చులతో వేములవాడకు చేరుకుని హుండీ లెక్కింపులో, భక్తుల సేవలో తరిస్తున్నారు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు సొంత ఖర్చులతో రాజన్న సన్నిధికి చేరుకుని సేవలందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా శ్రీలలితా సేవా ట్రస్టు, శివరామకృష్ణ భజన మండలి, శ్రీరాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు దశాబ్దానికిపైగా రాజన్న సేవలో తరిస్తున్నారు. ప్రతీసారి జరిగే హుండీ లెక్కింపుతో పాటు అన్ని పర్వదినాలు, రద్దీ రోజుల్లోనూ వీరు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో సేవా సమితి సభ్యులు వస్తుంటారు. గురువారం నాటి హుండీ కౌంటింగ్‌లో సుమారు 550మంది మహిళలు పాల్గొన్నారు. ‘మహిళలు ఆలయంలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారి సేవలకు కృతజ్ఞతగా మధ్యాహ్న భోజనం, రెండు లడ్డూలు, స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం’. అని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment