ఆ నలుగురు.. ‘సిరి’ వెలుగులు
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికవాడల్లో ఏ గడప తట్టినా.. కష్టాలు, కన్నీళ్లు. 2008లో వరుస ఆత్మహత్యలతో కార్మికక్షేత్రం తల్లడిల్లింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా సిరిసిల్లలో ఉండే విధంగా ఆదేశించారు. ఆత్మహత్యలు ఆగాలని స్పష్టం చేశారు. ఆర్డీవో ఆఫీస్ లోనే మకాం వేసిన కలెక్టర్ ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించారు. పేదరికం, పనిఒత్తిడి, మానసికవేదన, అప్పులేనని నిర్ధారించారు. వారిలో ధైర్యం నింపేందుకు ఓ నలుగురు మహిళలను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో ఇల్లిల్లు తిరుగుతూ బాధల్లో ఉన్న కార్మికులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఆ నలుగురే రాపెల్లి లత, బూర శ్రీమతి, వేముల అన్నపూర్ణ, కొండ ఉమ. వీరిని చేనేత జౌళిశాఖ ద్వారా నియమించారు. నిత్యం కార్మికవాడల్లో తిరుగుతూ కౌన్సెలింగ్ నిర్వహించారు. 16 ఏళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారికి ఆ నలుగురు అండగా నిలిచారు. కార్మికవాడలైన బీ.వై.నగర్, సుందరయ్యనగర్, తారకరామనగర్, ఇందిరానగర్, పద్మనగర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, శాంతినగర్, ప్రగతినగర్‌లోని కార్మికుల ఇళ్లకు వెళ్తూ వారి కష్టసుఖాలు తెలుసుకోవడవం, కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వీరివిధి. సైకాలజిస్ట్ పున్నంచందర్‌తో కలిసి మనోవిసాకాన్ని కలిగించేందుకు అనేక సదస్సులు నిర్వహించారు. అర్హులైన నేతకార్మికులకు అంత్యోదయ కార్డులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, నేతన్నలకు బీమా పథకాలను ఇప్పించడం, వైద్యం చేయించడం వంటి సామాజిక సేవలో ఆ నలుగురు ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment