కమిటీల పేరిట కాలయాపన
గోదావరిఖని: కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన సింగరేణి యాజమాన్యం కమిటీల పేరిట కాలయాపన చేయడం సరికాదని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. జీడీకే–2,2ఏ, జీడీకే–5 ఓసీపీ, ఏరియా ఆస్పత్రిలో శనివారం ఆయన పర్యటించారు. ఉద్యోగులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్ట్రక్చరల్ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి మధ్య జరిగిన చర్చల్లో యాజమాన్యం వాదన ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ చెల్లింపు భారం రూ.91కోట్లు సంస్థపైనే పడుతుందని చెప్పడం సరికాదన్నారు. రూ.35వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికే రావాల్సి ఉందన్నారు. ఒక్కపైసా ఆర్థికభారం పడని మారుపేర్ల కార్మికుల పిల్లల ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఐదు జాతీయ కార్మిక సంఘాలతోపాటు గత గుర్తింపు సంఘం చేసుకున్న ఒప్పందాన్ని యాజమాన్యం ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఇదే సమస్యపై గుర్తింపు సంఘంతో మళ్లీ కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ యూనియన్ సుధీర్ఘ పోరాట ఫలితంగా సొంతింటి పథకంపై కోలిండియా కూడా ఒక నిర్ణయానికి వచ్చిందని, సింగరేణిలో మాత్రం జాప్యం చేస్తోందన్నారు. గెలిచిన సంఘం సరైన వైఖరితో లేక పోవడంతోనే కార్మికులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. సమావేశంలో నాయకులు మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆసరి మహేశ్, సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, పి.శ్రీనివాసరావు, దాసరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు
సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment