ఉక్కుపాదం
డ్రగ్స్ మాఫియాపై
మాట్లాడుతున్న సీపీ అంబర్ కిశోర్ ఝా
● కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం
● సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే వేటు
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని: ‘గంజాయి, డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేస్తాం. ఇందుకోసం కమిషనరేట్ కేంద్రంగా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తాం. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునే పోలీసులపై వేటు వేస్తాం. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలతో ప్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం’ అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు..
సాక్షి: నేరాలను ఎలా నియంత్రిస్తారు?
సీపీ: బదిలీపై రామగుండం రావడం సంతోషంగా ఉంది. రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా ముందుకు సాగుతాం.
సాక్షి: గంజాయి రవాణా, విక్రయాలను ఎలా అరికడతారు?
సీపీ: గంజాయి రవాణా పెరిగినట్లు సమాచారం ఉంది. పాత నేరస్తులపై నిఘా ఉంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. విక్రయదారులు, తాగేవారిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం.
సాక్షి: డ్రగ్స్ నివారణకు ప్రత్యేక
ప్రణాళిక ఏమైనా ఉందా?
సీపీ: గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు 15 మందితో సిటీడ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఫోన్ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ నంబరుకు సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.
సాక్షి: పాత నేరస్తులు, భూమాఫియాపై..?
సీపీ: పాతనేరస్తులు, భూమాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం. సెటిల్‌మెంట్ల విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తేలేదు.
సాక్షి: రోడ్డు ప్రమాదాలను ఎలా నియంత్రిస్తారు?
సీపీ: వరంగల్ సీపీగా పనిచేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకున్న చర్యలతో 20 శాతం ప్రమాదాలు తగ్గాయి. బ్లాక్‌స్పాట్ల వద్ద దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతాం.
సాక్షి: పోలీసులకు మీరిచ్చే సూచనలేమిటి?
సీపీ: శాంతిభద్రతల పరిరక్షణలో పకడ్బందీగా వ్యవహరించాలి. ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండాలి. ఉదయం, సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఉండి ఫిర్యాదులు స్వీకరించాలి. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఉంటే సహించేదిలేదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే వారిపైనా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: సైబర్‌నేరాలను ఎలా నియంత్రిస్తారు?
సీపీ: సైబర్‌నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అపరి చితులు, అపరిచిత ఫోన్ నంబర్లకు సమాధానం ఇవ్వవద్దు. బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయొద్దు.
సాక్షి: ప్రజల నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు?
సీపీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి వారి వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. మత్తుపదార్థాల విక్రయాలను అరికట్టేందుకు సహకారించాలి. సమస్యల పరిష్కారానికి పోలీసులను ఆశ్రయించాలి. న్యాయం జరగకుంటే నేరుగా నన్ను సంప్రదించాలి.
సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
సీపీ: గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగ యువతను చేరిదీసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే ఉట్నూర్ ఐటీడీఏ సహకారంతో గతంలో యువతకు శిక్షణ ఇప్పించి అగ్రగామిగా తీర్చి దిద్దాం. ఇక్కడ కూడా యువతకు ఉపాధి శిక్షణ, కాంపిటేటివ్ పరీక్షల్లో తర్ఫీదు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇస్తాం. ఇంటర్వ్యూలలో నెగ్గేలా తీర్చిదిద్దుతాం. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం.
ఉక్కుపాదం
Comments
Please login to add a commentAdd a comment