కోల్‌సిటీ(రామగుండం): పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణికి సకాలంలో పురుడు పోశారు 108 సిబ్బంది. సప్తగిరికాలనీకి చెందిన బండి వెంకటేశ్ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతడి భార్య పద్మ నెలలు నిండు గర్భిణి. శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే నొప్పులు అధికమమయ్యాయి. ఆమె తల్లడిల్లుతుండగా ఆందోళన చెందిన భర్త.. 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన ఈఎంటీ రవీందర్, పైలట్ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో తరలించే పరిస్థితి లేకపోవడంతో ఆటోలోనే గర్భిణాకి పురుడు పోశారు. ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువుతోపాటు బాలింతను జీజీహెచ్ తరలించగా వైద్యులు శిరీష, శివరంజని చికిత్స అందించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబసభ్యులు 108 సిబ్బందిని అభినందించారు.