
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని హనుమన్ ఆలయం వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి అపసార్మరక స్థితిలో పడి ఉండగా అక్కడే కొందరు 108కు ఫోన్ చేసి మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మృతుడిని గుర్తిస్తే మెట్‌పల్లి డీఎస్పీ 8712656803, సీఐ 8712656819, ఇబ్రహీంపట్నం ఎస్సై 8712656795కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తేనెటీగల దాడిలో 11 మంది కూలీలకు గాయాలు
మంథని: గాజులపల్లి సమీపంలోని కాలువ వద్ద మంగళవారం ముళ్లపొదలను తొలగిస్తున్న ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన పలువురు కూలీలు ఉపాధిహామీ పనుల్లో భాగంగా కాలువ వద్ద పనిచేస్తున్న క్రమంలో తేనెటీగలు దాడి చేయగా 11 మంది గాయపడ్డారు. వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను నాయకులు బూడిద గణేశ్, ఆర్ల సందీప్, సురేశ్, లింగయ్య, బావు రవి కోరారు.
ఆత్మహత్యకు కారకులైన
ముగ్గురికి జీవిత ఖైదు
కరీంనగర్‌క్రైం: తమ ఇంటి అమ్మాయిని పెళ్లిపేరుతో వంచించి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఓ యువకుడిని తీవ్రంగా బెదిరించగా అవమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితులు ముగ్గురికి జీవిత ఖైదు, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రామగుండం మండలం మర్రిపల్లికి చెందిన గూండా శంకరయ్య తన కూతుర్ని ప్రేమపేరుతో నమ్మించి మోసం చేశాడని అదే గ్రామానికి చెందిన దొబ్బల పవన్(21)పై క్రిమినల్ కేసు పెట్టాడు. పవన్ జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నాళ్లకు పవన్‌కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. విషయం తెలిసిన గూండా శంకరయ్య, అకినపల్లికి చెందిన మండే శ్రీనివాస్, ఎగ్లాస్‌పూర్‌కు చెందిన క్యాతం రవీందర్ 2016 ఆగస్టు 21న పవన్‌ను అడ్డగించి నానా బూతులు తిట్టి చనిపో అని అవమానపరిచారు. ఇంటికి వచ్చిన పవన్ జరిగిన విషయాన్ని తన తమ్ముడికి చెప్పి రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు గుండా శంకరయ్య, మెండె శ్రీనివాస్, క్యాతం రవీందర్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి ట్రైనీ ఐపీఎస్ అపూర్వరావు కేసు దర్యాప్తు జరిపారు. ఈ కేసులో సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరెల్లి రాములు కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
దళిత మహిళను వేధించిన వ్యక్తికి ఏడాది జైలు
గోదావరిఖని: స్థానిక అడ్డగుంటపల్లెకు చెందిన దళిత మహిళను వేధించిన కేసులో రాజీవ్‌కాలనీకి చెందిన ఆవుల మల్లయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డగుంటపల్లెలో ఒకదళిత మహిళను కులం పేరిట దూషిస్తూ వేధించాడు. దీంతో ఆవుల మల్లయ్యపై 2017లో కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. జడ్జి నీలిమ పూర్వపరాలు పరిశీలించారు. నేరం రుజు కావడంతో మల్లయ్యకు జైలు, జరిమానా విధించారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన పోలీస్ కానిస్టేబుల్ మహేందర్, ఏఎస్‌ఐ తిరుపతిరావు, ప్రభుత్వ న్యాయవాది రాములును పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా, డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేశ్ అభినందించారు.
ముగ్గురికి జీవితఖైదు
రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, ఎగ్లాస్‌పూర్ గ్రామాలకు చెందిన ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ కరీంనగర్ మూడోఅదనపు జిల్లా న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారు. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దొబ్బల పవన్‌ను 2016వ సంవత్సరంలో పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని బెదిరించి, చనిపోవడానికి ముగ్గురు వ్యక్తులు కారకులయ్యారు. ఈ మేరకు మృతుడి తండ్రి దొబ్బల పోచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి గోదావరిఖని ఏఎస్‌పీ విష్ణు ఎస్.వారియర్ విచారణ జరిపిన అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి శంకరయ్య(మర్రిపల్లి), శ్రీనివాస్(ఆకెనపల్లి), రవీందర్(ఎగ్లాస్‌పూర్)పై నేరం రుజువైందని నిర్ధారించారు. వారికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వేయి జరిమానా విధించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి