
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధూరి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలుచేశారు. పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి ఎస్‌డీఎం ఆఫీస్‌కు చేరుకుని నామపత్రాలు సమర్పించారు. మాల్వా ప్రాంతంలోని సంగ్రూర్ లోక్‌సభ స్థానం పరిధలోనే ధూరి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. (చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ )
సంగ్రూర్ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు భగవంత్ మాన్. పంజాబ్‌లో ఫిబ్రవరి 1తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 20 పోలింగ్ జరనగుంది. మార్చి 10న ఫలితాలు విడుదల అవుతాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నామినేషన్
అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నామినేషన్ దాఖలుచేశారు. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్ఫించారు. అమృత్‌సర్ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సిద్ధూ.. తాజా ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అకాలీదళ్ నుంచి మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజితియా ఆయనపై పోటీ చేస్తున్నారు. వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న ఐఏఎస్ అధికారి జగ్‌మోహన్‌సింగ్ రాజును బీజేపీ బరిలోకి దించింది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.