భాగపట్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదేళ్ల పదవీ కాలం చివరి దశకు చేరడంతో ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారం కోసం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేస్తున్న ప్రయత్నాలు అంత తేలిగ్గా సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ విసురుతోంది. దానికితోడు ఇటీవలి రైతు ఉద్యమాలకు కేంద్రమైన పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, రాజకీయ పార్టీల ఎత్తులు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల వైభవాన్ని నిలుపుకోవాలన్న ఆ పార్టీ ఆశలను కులాల సమీకరణతో చిత్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఉర్రూతలూగుతోంది. జాట్‌లు, ముస్లింలు, రైతులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కులాలు, వర్గాల వారీగా ఓట్లు కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్‌ఎల్‌డీతో పొత్తు కుదుర్చుకొని జాట్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడంలో ఎస్పీ సఫలమైంది. జాట్‌లలో చీలిక తెచ్చి కూటమి వ్యూహాలను బద్ధలు కొట్టే ప్రణాళికలతో బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది.
ముస్లిం–జాట్‌ల సోదరబంధం
ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరీ తాత, మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్‌సింగ్ ‘కిసాన్ నేత’గా కీర్తి గడించారు. ఆయన హయాం నుంచే ముస్లింలు జాట్‌లతో సత్సంసంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పీ– బీఎస్పీ పుట్టుకకు ముం దు పశ్చిమ యూపీ ముస్లింలు చరణం సింగ్ ఎవరికి మద్దతు ఇస్తే వారినే బలపరిచే వారు. అజిత్ సింగ్ కూడా వారిని కలుపుకుంటూ రాజకీయాలు సాగించారు. అయితే జాట్–ముస్లింల బంధాన్ని 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు దెబ్బ తీశాయి. అల్లర్ల అనంతరం రెండు వర్గాల మధ్య చీలక ఏర్పడి ముస్లింలు ఆర్‌ఎల్‌డీకి దూరమయ్యారు. ఈ కారణంగా ఆర్‌ఎల్‌డీ 2014, 2019 ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేదు. ‘మా రెండు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బ తీయడానికి జరిగిన కుట్ర అది. చిన్న ఘటనను ఆధారం చేసుకుని సాగిన హింసాకాండను ఏ రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకు వాడుకున్నదో అందరికీ తెలుసు’ అని భాగపట్‌లో ఎస్పీ తరపున చురుకుగా ప్రచారం చేస్తున్న రసూల్ అలీ ఖాన్ అన్నారు.
ఇప్పటికీ అదే అల్లర్లను బూచీగా చూపి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నది అలీఖాన్ ఆరోపణ. జాట్–ముస్లిం–రైతులు కలిస్తే కనీసంగా 50 స్థానాలు గెలువచ్చన్న అంచనాతో పొత్తు పెట్టుకున్న ఆర్‌ఎల్‌డీకి ఎస్పీ 33 సీట్లు కేటాయించింది. ఇందులో ఆర్‌ఎల్‌డీ 5 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. మిగతా స్థానాల్లో ఎస్పీ పోటీలో నిలవగా ఇందులో 8 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. అయితే సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. ముఖ్యంగా సర్ధన, హస్తినాపూర్ సీట్లను ఎస్పీకి అప్పగించడంపై ఆర్‌ఎల్‌డీ జాట్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముజఫర్‌నగర్ జిల్లాలోని 6 స్థానాలకు గానూ 4 స్థానాల్లో ముజఫర్‌నగర్ సదర్, మీరాపూర్, ఖటోలీ, పుర్కాజీ స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలను బరిలోకి దింపింది. దీంతో ఆర్‌ఎల్‌డీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు.
ఇంతకు జాట్‌లు ఎటువైపు?
పశ్చిమ యూపీలో పార్టీల గెలుపోటముల పాత్ర కీలకమైనది. గడచిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో జాట్‌లు మద్దతు ఇవ్వడంతో బీజేపీ సునాయసంగా విజయాలు దక్కించుకుంది. అయితే, రైతు ఉద్యమం నేపథ్యంలో జాట్‌లు బీజేపీకి వ్యతిరేకమయ్యారని,అది తమకు లాభిస్తుందని ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి విశ్వాసంతో ఉంది. ఎస్పీకి ఓట్ల బదిలీ అంత సులభం కాదని దాద్రి, భాగ్పట్, మీరట్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల పరిశీలనలో వెల్లడైంది. ఎస్పీ అధికారంలోకి వస్తే జయంత్ సింగ్ చౌధురి పాత్ర నామమాత్రమే అవుతుందంటూ బీజేపీ కేడర్ జాట్‌లకు నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే గుర్తు చేస్తోంది.‘జయంత్ చౌధురి పార్టీ పోటీ చేసే స్థానాల్లో మా మద్దతు ఉంటుంది. కానీ,అఖిలేశ్ పై మాకు పూర్తి నమ్మకం లేదు’ అని దాద్రి ప్రాంతానికి చెందిన రైతు కిషన్‌సింగ్ చౌదరి అన్నారు.
ఆ ఎత్తుగడ.. రెండువైపులా పదునున్న కత్తి!
ముస్లిం ఓట్లు కీలకమైన ముజఫర్‌నగర్ డివిజన్ లో ఎస్పీ ఒక్క ముస్లింను కూడా బరిలోకి దింపలేదు. ముస్లిం ఓట్లు ఎటూ తమకే దక్కుతాయన్న అంచనాతో హిందూ ఓట్ల చీలిక కోసం ఈ వ్యూ హం పన్నింది. ఇది సీట్లు ఆశించిన ముస్లిం నేతల అసంతృప్తికి కారణమైంది. మరోవైపు ఇదే అదునుగా మాయావతి ఏకంగా 17 మంది ముస్లింలను బరిలోకి దించింది. దాంతో బీజేపీని ఎదుర్కొనేందుకు గంపగుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలనుకున్న ముస్లింల మధ్య అయోమయం నెలకొంది. ‘మేము ఈ ఎన్నికలలో ఎస్పీకి మద్దతు ఇ వ్వాలనే భావించాం. కానీ ఎస్పీ మా మనోభావాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మాకింకా స్పష్టత రాలేదు’ ముజఫర్‌నగర్ వాసి ఫరీద్ అన్నారు.
ఇతరులను దువ్వేద్దాం!
ఇక పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతంగా ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు ఇవ్వని బీజేపీ 76 స్థానాల్లో 66 స్థానాలనుగెలిచింది. కేవలం తనకున్న హిందుత్వ బలం, సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ ప్రస్తుతం జాట్‌ల చీలికపై దృష్టి పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ జ్ఞాపకార్థం ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్ అటు రైతు నేతలు, ఇటు జాట్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ పొత్తుల నేపథ్యంలో జాట్ వర్గం గంపగుత్తగా అఖిలేశ్ అండ్ కో వైపునకు వెళ్లకుండా జాట్ నేతలతో కేంద్ర హోమంత్రి అమిత్ షా జనవరి 26న కీలక సమావేశం నిర్వహించారు.
పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌సింగ్ వర్మ ఇంట్లో 200 మంది పశ్చిమ యూపీకి చెందిన జాట్ నేతలతో నిర్వహించిన భేటీకి హాజరైన అమిత్ షా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్‌ఎల్‌డీ పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, అవసరమైతే ఎన్నికల తరువాత పొత్తుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ప్లాన్–బి కింద బీజేపీ పశ్చిమ యూపీలో అధికంగా ఉండే షైనీలు, పాల్‌లు, కశ్యప్‌లు, ప్రజాపతిల ఓట్లను అభివృధ్ధి మంత్రంతో ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ‘జాట్‌లు మాత్రమే కాదు. ఇంకా మావి చాలా కులాలు ఉన్నాయి. మేను కూడా గెలుపోటములు నిర్ణయించగలము’అని భాగ్పట్ మార్కెట్‌లో టీ దుకాణం నడుపుతున్న శంకర్ లాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment