
సత్తెనపల్లి: తనపై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు పత్రికల్లో, ప్రసార సాధనాల్లో కథనాలు ఇస్తూ దుష్ట చతుష్టయం శునకానందం పొందుతోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పా రు. సోమవారం పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 375 గృహా లకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి తెలు సుకోవడంతోపాటు, వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేశారు.
ఆయనను కొందరు నిలదీసినట్లు ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. వీటికి స్పందిస్తూ అంబటి ఓ వీడియో విడుదల చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాను ప్రజలను కలుసుకున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరు, జనసేన పార్టీకి చెందిన ఒకరు సంక్షేమ పథకాలపై ప్రశ్నించారని అంబటి ఆ వీడియోలో చెప్పారు. దీనిని దుష్టచతుష్టయం చిలువలు పలువలు చేసిందన్నారు.
తనను మహిళలు నిలదీశారని, బెండు తీశారని టీడీపీకి చెందిన దుష్ట చతుష్టయం ఛానల్‌లో పదే పదే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దుష్టచతుష్టయమే ముందుగా ఇలా ప్రశ్నించాలని ప్లాన్ చేసి వారితో అడిగించి ఉంటారని అన్నారు. ఇందుకు దుష్టచతుష్టయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన చానల్స్‌లో తనపై నెగెటివ్ వార్తలు మాత్రమే ఇస్తారని, పాజిటివ్ వార్తలు ఎలాగూ ఇవ్వరని చెప్పారు. నెగెటివ్ వార్తలు అయినప్పటికీ, తన కోసం ప్రత్యేకంగా స్పేస్ కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ వీడియోలో చురకలంటించారు.