సాక్షి, ఖమ్మం: ఎన్నికల వేళ తెలంగాణ కాషాయం పార్టీలో జోష్ నింపేందుకు వచ్చిన ఆ పార్టీ జాతీయ స్థాయి కీలకనేత అమిత్ షా.. ఖమ్మం సభలో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ సర్కార్‌ను ఓడించి అధికారంలోకి రావడం ఖాయమంటూ ప్రసంగించారు. అందుకు బీజేపీ సమాయత్తంగానే ఉందన్న స్థాయిలోనూ ఆయన మాట్లాడారు. అయితే.. సభ అనంతరం పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆదివారం ఖమ్మం వేదికగా జరిగిన రైతు గోస.. బీజేపీ భరోసా బహిరంగ సభ అనంతరం బీజేపీ కోర్ కమిటీతో అమిత్ షా అరగంట పాటు భేటీ అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో పార్టీలో జరిగిన సంస్థాగత మార్పులను సైతం ప్రస్తావించి మరీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నేతల మధ్య ఇంకా సమన్వయం కొరవడడాన్ని అధిష్టానం గమనించిందని ఆయన హైలెట్ చేసినట్లు సమాచారం.
ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో నేతలు సమన్వయంతో పని చేయాల్సింది పోయి.. ఇంకా గ్రూప్‌లుగా ఉండడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్న నేతలకు సపోర్ట్ చేయాలని.. అదే సమయంలో ఎన్నికల కోసం వేగం పెంచాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
- ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ఈ స్పీడ్ సరిపోదు. ఇంకా వేగంగా పని చేయాలి.
- ఎన్నిక, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటులో వేగం పెంచండి.
- మీకు పార్టీ అధిష్టానం నుంచి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది.
- గెలుపు అవకాశాలు బోలెడు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవద్దు.
- కాన్ఫిడెన్స్, క్లారిటీ, కోఆర్డినేషన్, కమిట్‌మెంట్, క్రెడిబిలిటీ.. ఇలా సీ-5 ఫార్ములాతో ముందుకు వెళ్లండి.
- నేతలు ఎవరేం చేస్తున్నారో హైకమాండ్ అన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.
ప్రత్యర్థి పార్టీల నుంచి అసంతృప్త నేతల చేరికలపై ఫోకస్ పెట్టండి. భారీగా చేరికలని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, కీలకమైన, చెప్పుకోదగ్గ వాళ్లెవరూ ముందుకు రావడం లేదు. వాళ్ల విషయంలో త్వరపడండి. అందివచ్చిన ఏ అవకాశం వదులుకోవదు.. ముందుకు వెళ్లండి అని ముఖ్యనేతలకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: కేసీఆర్... నీ పనైపోయింది- షా మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment