హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది.
పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.
టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.
పల్నాడు
- దాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికం
- కర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులు
- బత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులు
- తీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపు
కాళ్లు చేతులు నరికేశారు!
పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్‌సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలు
తాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం
తాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.
పల్నాడులో 144
పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు.
నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment