ఈ పవన్‌కు ఏమైంది? ఒకవైపు తాము లేనిదే టీడీపీ అధికారంలోకి రాదంటాడు.. మరోవైపు పావలా వంతు సీట్లు(175కి 24 సీట్లా?) కూడా ఇవ్వకున్నా నవ్వుతూ ప్రెస్ మీట్‌లో మాట్లాడతాడు. తమ ఆత్మగౌరవనైనా పట్టించుకోవాలని పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తి సైతం పట్టించుకోడు. ఏదైనా అంటే.. బాబుతో జట్టు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటాడు. పొంతన లేని మాటలు.. నిలకడలేని తత్వం.. అసలు రాజకీయాలకు పనికొస్తాడా? అనే అనుమానం ఇప్పుడు జనసేనవాళ్లకే కలిగేలా చేస్తున్నాడు.
ఎవరైనా పిలిచారా? లేదా తనంతట తానే వెళ్లాడా? తెలియదుగానీ.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంగా ఆగమేఘాల మీద చంద్రబాబు ముందుకు ఉరికొచ్చాడు. లోపల ఏం జరిగిందో తెలియదుగానీ.. బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశాడు. ఆ ప్రకటన పక్కనే ఉన్న హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బావ బాలకృష్ణకు సైతం ఆశ్చర్యం కలిగింది. దీంతో ఆ డీల్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే అవతల ఉంది చంద్రబాబు కాబట్టి.. ఎలాగైనా పవన్‌ను వంచేస్తాడనే మరో విశ్లేషణ కూడా బలంగానే నడిచింది.
ఇక.. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి వస్తుందని.. ఢిల్లీ పెద్దలూ తనతో టచ్‌లో ఉన్నారంటూ పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ, టీడీపీతో పొత్తు విషయంలో కమలం పెద్దలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. పైగా పవన్ ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది కూడా. అందుకే పవన్‌కు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని టాక్ వినిపించింది. అలాంటి టైంలోనే.. కూటమిలో బీజేపీని కలిపేందుకు యత్నించి చివాట్లు తిన్నానంటూ పవన్ స్వయంగా చెప్పడంతో.. టీడీపీ-చంద్రబాబు గాలి కంబైన్డ్‌గా తీసేసినట్లయ్యింది. అయినా సిగ్గులేకుండా ఇవాళ జాబితా ప్రకటన సమయంలోనూ పొత్తుకు బీజేపీ ఆశీర్వాదం ఉందంటూ కబుర్లు చెప్పాడు.
పవన్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నాకు తిక్కుంది.. దానికో లెక్కుంది అని. కానీ, ఆ తిక్క ఊహించిన దానికంటే ఎక్కువేనని రియల్ లైఫ్‌లో.. అందునా రాజకీయ జీవితంలో చూపించుకుంటున్నాడు. కుప్పంలో బాబుకు రెస్ట్ ఇద్దామంటూ భువనేశ్వరితో చెప్పించి అయోమయం క్రియేట్ చేసి.. ఆ వెంటనే ఇవాళ సీట్లు ప్రకటించారు చంద్రబాబు. పనిలో పనిగా 57 స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్‌లో పెట్టాడు. ఇదంతా బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని పవన్ అర్థం చేసుకోలేకపోతున్నాడా?. లేకుంటే కావాలనే చేస్తున్నాడా?.. రేపు ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి జనసేన కంటే ఎక్కువ సీట్లు ఇస్తే పరిస్థితి ఏంటి? పవన్‌ను ఇన్నేళ్లు అంటిపెట్టుకుని ఉన్న లీడర్లు.. దిగమింగుకోగలరా?..
పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకు!.. పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ.. గత ఎన్నికల్లో 130కిపైగా స్థానాల్లో పోటీ చేసిన పార్టీకి ఈ దుస్థితి?. ఇది చాలదన్నట్లు.. జనసేనకు ఈ సీట్లు ఇవ్వడమే గొప్ప అంటూ అంటూ టీడీపీ అనుకూల ఛానెల్స్, భజన సైట్లు ఇప్పుడు కథనాలు ఇస్తున్నాయి. దీంతో జనసేన కేడర్ అవమాన భారంతో రగిలిపోతోంది. సోలోగా పోటీ చేసిన జనసేన అంతకుమించి సీట్లు ఈసారి దక్కించుకునే అవకాశం ఉండేది కదా అని బాధపడుతోంది.
ఆఖరిగా పోనీ.. ఇచ్చిన 24 స్థానాలకైనా అభ్యర్థుల్ని ప్రకటించగలిగాడా? అంటే అదీ లేదు. కేవలం ఐదుగురి పేర్లను మాత్రమే ప్రకటించాడు. అంటే.. ఆ 19 స్థానాలకు అభ్యర్థులు లేరా?.. పోనీ ప్రకటించిన పేర్లైనా సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. అదీ ఓ నోట్ బుక్‌పై రాసిన పేర్లను మీడియాకు ప్రదర్శించాడు. అదీ అప్పటికప్పడు రాసిన పేర్లని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాబితా ప్రకటన చివరి క్షణం దాకా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో పవన్ నిర్ణయించుకోలేదనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. అదేసమయంలో చంద్రబాబు వెల్ ప్రిపేర్డ్‌గా టీడీపీ జాబితాను ప్రకటించాడు. అంటే.. ఇక్కడా బాబు డామినేషన్ ముందు పవన్ తలవంచక తప్పలేదు. మరి తొలి నుంచి సీట్ల పంపకం విషయంలో పైచేయి ఉండాలని కోరుకుంటున్న కాపు సంక్షేమ అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. తాజా పరిణామాలపై, పవన్ తీరుపై ఎలా స్పందిస్తారో చూడాలి.
::పొలిటికల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment