సాక్షి, అమరావతి: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తనపై పరువు నష్టం దావా వేయడంపై ఏపీ ఎఫ్డీసీ (AP FDC Chairman) చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారంటూ సచివాలయంలో ఆయన చంద్రబాబు, లోకేష్ ద్వయంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో నారా లోకేష్‌పై పోసాని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
లోకేష్ నాపై రూ.4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కంతేరులో 14 ఎకరాలు కొన్నారని నేను అన్నారని పరువు నష్టం దావా వేశారు. అల్ ఖైదా పేరు చెబితే బిన్ లాడెన్ గుర్తుకు వచ్చినట్టు హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకు రాడా?. హెరిటేజ్ ఆస్తులు నీవి కావా?. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నమాట నిజంకాదా?. అసలు లోకేష్ ఎవరిపై విమర్శలు చేయలేదా? అని పోసాని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అని పోసాని నిలదీశారు. లోకేష్ బాబు పీఏ చైతన్య తనకు ఫోన్ చేశాడని.. టీడీపీలోకి ఆహ్వానించాడని కూడా పోసాని మీడియా ద్వారా వెల్లడించారు.
► ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఎన్ని కేసులు ఉన్నా జైలుకు వెళ్లలేదు. పుంగనూరులో ఏకంగా పోలీసులపై కూడా హత్యా ప్రయత్నం చేశారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే నాపై కక్ష గట్టారు. అందుకే నాపై పాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి నన్ను తిట్టిస్తున్నారు. సిఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్లినపుడు పసుపు నీళ్లతో కడిగించారు. కులాభిమానం ఉండొచ్చు.. దురాభిమానం ఉండకూడదు. గెలిచింది ఎవరైనా.. ముఖ్యమంత్రి ఎవరైనా.. ప్రజలకు మంచి చేస్తున్నారా? లేదా? అనేది చూడాలి.
► బూతుల కంటే బూతు పనుల వల్లే సమాజానికి ఎక్కువ నష్టం. రామోజీరావుని బ్రోకర్ అనే అన్నాను. చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ కూర్చుని గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని వస్తుందని ఆరు నెలల ముందే డిసైడ్ చేశారు. రాజధాని భూములలో త్యాగాలు లేవు.. అంతా వ్యాపారాలే. గన్నవరంలో భూములు పోతే రాజధాని ప్రాంతంలో అశ్వనీదత్ కి ఎందుకు భూములిచ్చారు అని పోసాని నిలదీశారు.
► పెదకాకానిలో నాకు 16 ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాసిస్తా. నాది పెదకాకాని. పేద కుటుంబం. నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకానిలో పొలాలు లేవు. ఏడు స్ధలాలు ఉన్నాయి. అయిదెకరాలతో కలిపి నా ఆస్తులు కోట్ల రూపాయిలలో ఉన్నాయి. నా ఆస్తులు మొత్తం పేదలకి ఇచ్చేస్తా. మీకు మానవత్వం ఉంటే ఒక సెంట్ ఇవ్వండి పేదలకి అంటూ ఆరోపణలకు పోసాని కౌంటర్ ఇచ్చారు.
► అమరావతిలో ఐదు శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టం ఉంది. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారు. రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ నాడు రూ.11 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశారు. అదీ కులాలకు అతీతంగా. అప్పుడు తమకు ఈ రుణమాఫీ వద్దని రైతులు చెప్పారా?. పెదకాకానిలో నాకు కొన్ని ఇళ్ల స్థలాలు మాత్రమే ఉన్నాయి. నా కష్టార్జితంతోనే ఆ భూములు కొన్నాను. అవసరమైతే నా భూములన్నీ పేదలకు ఉచితంగా ఇచ్చేస్తా. పేదల భూములపై కేసులు వెనక్కి తీసుకోండి అని అమరావతి రైతుల్ని ఉద్దేశించి పోసాని వ్యాఖ్యానించారు.
► నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. వైఎస్ జగన్ వ్యక్తిత్వం చేరే ఆయన చెంతకు చేరాను. నా జీవితాంతం వైఎస్ జగన్ వెంట ఉంటాను. చావుకు భయపడని వ్యక్తిని నేను అని పోసాని స్పష్టం చేశారు. నన్ను చంపాలని నారా లోకేష్ కుట్ర పన్నుతున్నారు. మంగళగిరి కోర్టుల చుట్టూ నన్ను తిప్పాలని.. నేను వెళ్లినప్పుడు చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ నేను చనిపోతే దానికి లోకేష్‌దే బాధ్యత. అయినా చావుకు నేను భయపడను అని పోసాని సంచలన కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment