
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమరావతే రాజధానిగా కొనసాగాలని, మూడు రాజధానులు అవసరం లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఖండించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటు పడుతుంటే.. అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం తగదని అన్నారు.
విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా కాకుండా ఎవరు అడ్డుకున్నా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇంకా పురిటిలోనే ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధిగా అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని టచ్ చేస్తే వారికే ప్రమాదకరమన్నారు. తెలంగాణలో దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 బీసీ కులాలకు బీసీ, ఓబీసీ రిజర్వేషన్ తొలగించడంతో గత నాలుగేళ్లుగా తీవ్ర సామాజిక అన్యాయానికి గురయ్యారన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా కొత్త వాటిని నెత్తినేసుకోవడం తోట చంద్రశేఖర్ రాజకీయ అపరిపక్వతను సూచిస్తోందన్నారు.