సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజకీయ వర్గాలు స్కిల్ కేసులో నేటి సుప్రీం కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తాను తప్పు చేయలేదని చెప్పలేకపోతున్న చంద్రబాబు.. తన అరెస్ట్ చెల్లదని, తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాడీవేడిగా వాదనలు జరిగిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నాం తీర్పు వెలువడనుంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అదే సమయంలో ఆయనపై ఫైబర్‌నెట్ కేసు నమోదు కాగా ఈ కేసులోనూ సుప్రీంను ఆశ్రయించారు ఆయన తరఫు లాయర్లు. అయితే.. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్‌నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. దీంతో.. ఇవాళే 17-ఏ పిటిషన్‌పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది.
వాడీవేడీ వాదనలు ఇవే..
స్కిల్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టుల్లో వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఆ మరుసటిరోజు సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు.
అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల విజ్ఞప్తులు.. వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న తీర్పును ఇవాళ వెల్లడించనున్నారు.
ఏపీ సీఐడీ అభియోగాలు.. అరెస్ట్.. రిలీజ్
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనేది సీఐడీ అభియోగం.
డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా.
ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment