లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొత్తులు, సీట్ల కేటాయింపులపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని శనివారం ప్రకటించారు. తమ భాగస్వామ్య కూటమి అధికారంలోకి వస్తే.. ఇద్దరిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తామని తెలిపారు.
ఒకరు ఓబీసీ సామాజికవర్గం నుంచి మరోకరిని దళిత సామాజికవర్గం నుంచి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ముస్లిం కమ్యూనిటీతో పాటు ముగ్గురిని డిప్యూటీ సీఎంలను ఎంపిక చేస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. గతంలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఒవైసీ ప్రకటించారు. రాజ్‌భర్ ఆ కూటమిని విడిచిపెట్టి.. సమాజ్‌వాదీ పార్టీలో కలిశారు.
రాజ్‌భర్ పార్టీ తమ కూటమి నుంచి విడిపోయిందని, అయినప్పటికీ 100 సీట్లలో తమ కొత్త కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో ఏ రాజకీయపార్టీ ముస్లింల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ముస్లింకు ఉత్తరప్రదేశ్‌లో అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి పాటుపడటంలేదని తెలిపారు. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని, మార్పు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని, తమకు ఎవరు మంచి చేస్తారో వారినే ఎన్నుకుంటారని ఎంపీ అసదుద్దీన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment