సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు కొంచెం కూడా మేలు చేయలేదని.. అలాంటి వ్యక్తిని గిరిజనులు ఎప్పటికీ నమ్మరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. చంద్రబాబు అరకులో సభ పెట్టి వైఎస్సార్‌సీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చాడా? అసత్య ప్రచారానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు గిరిజన ద్రోహి అయితే సీఎం జగన్ గిరిజన బంధువు.
బాబు తన హయాంలో గిరిజన శాఖకు మంత్రిని కూడా పెట్టలేదు. అలాంటి బాబు అరకులో గిరిజనులపై ప్రేమ నటిస్తున్నారు. గిరిజనులకు పోడు భూములను పంచిపెట్టిన ఘనత సీఎం జగన్‌దే. చంద్రబాబూ ఎందుకు సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయారో చెప్పాలి. గిరిజనులకు బుద్ధిలేదు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఈ రాష్ట్రంలోని ఏడు గిరిజన అసెంబ్లీ, ఒక పార్లమెంటును వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇదే గతిపడుతుంది.
బాబుకు ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు?
రాష్ట్రంలో 38 లక్షల మంది గిరిజనులు తమకు ప్రత్యేకమైన గిరిజన కమిషన్ కావాలని అడిగితే, చంద్రబాబు ఆ ఆలోచన కూడా చేయలేదు. అదే జగన్ సీఎం అయిన వెంటనే గిరిజన కమిషన్ ఏర్పాటుచేసి మా హక్కులకు భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఏ సీఎంకి రాని అద్భుతమైన ఆలోచనతో గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం చేపట్టారు.
చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలనిపించలేదు? చంద్రబాబు ఇప్పుడొచ్చి ఎన్నెన్నో మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటే. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానంటే దాన్ని కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి సాగును విపరీతంగా ప్రోత్సహించారు. అదే సీఎం జగన్ ఆ సాగును అరికట్టడమే కాక వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment