సాక్షి, హైదరాబాద్: ప్రజా సంగ్రామ యాత్ర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తలపెట్టింది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ చెప్పారు. నియంత పాలన నుంచి విముక్తి పొందా లని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కష్టాలు, బాధలు, ఇబ్బందులను క్షేత్రస్థాయి లో స్వయంగా తెలుసుకుని.. వారి కన్నీళ్లు తుడిచి.. బీజేపీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేపడుతున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటే.. ప్రత్యేక తెలంగాణ ప్రాథమిక లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరుతాయనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని చెప్పా రు. శనివారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించనున్న బండి సంజయ్‌తో ‘సాక్షి’ఇంటర్వూ్య ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ
ఏ ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం పోరాడి, అమరుల బలిదానాలతో తెలంగాణ సాధించామో వాటికి కేసీఆర్ సర్కార్ తిలోదకాలిచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతుల్లోనే బందీ అయ్యింది. అవినీతి, అరాచక, నియంత పాలన సాగుతోంది. ఉద్యమ సమయంలో ఒకరకంగా, సీఎం అయ్యాక మరోరకంగా, ఇప్పుడు ఇంకొక రకంగా సీఎం వ్యవహారశైలి ఉంది. ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర తలపెట్టాం. యాత్రలో వెలుగులోకి వచ్చిన, తెలుసుకున్న అంశాలు, విషయాలతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ఒత్తిడి పెంచుతాం. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాయం
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో వందసీట్లు గెలుస్తామని విశ్వసిస్తున్నాం.
ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు
కాంగ్రెస్ సహా ఏ పార్టీ అధ్యక్షుడైనా గెలుపుపై విశ్వాసంతోనే కార్యక్రమాలు చేపడతారు. తమ పార్టీని శక్తివంతంగా మార్చుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపడతారు. అయితే ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారు? ఎవరు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు? ఇవన్నీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించే అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు.
పార్టీలో ఆధిపత్య పోరు ఉండదు
బీజేపీలో ఆధిపత్యపోరు ఉండదు. ఇది ఒక వ్యక్తి ఆధారంగా ఏర్పడినది కాదు.అందరూ సమష్టిగా ముందుకు సాగాలి. కాంగ్రెస్‌తో పోల్చితే బీజేపీలో పరిమితంగా పదవులు ఉన్నందున కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తుంటే నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కిషన్‌రెడ్డి నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. అన్నింట్లో సూచనలు, సలహాలిస్తున్నారు. సీనియర్ నేతలంతా కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నాం.
బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది
బీజేపీ ఓటమి నుంచి వచ్చిన పార్టీ. డబ్బులు ఖర్చు చేసి, మోసం చేసి, మాయమాటలు చెప్పి ఎక్కడా అధికారంలోకి రాలేదు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం. టీఆర్‌ఎస్ అడ్డగోలుగా రూ.వంద కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. ఇలా గెలిచినందుకే ఆ పార్టీ ఎక్కడా విజయోత్సవాలు చేసుకోలేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగగా.. టీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం తగ్గింది..కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కిందిస్థాయిలో మా పార్టీ బాగా ఉన్నందునే వివిధ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలన్నీ సమర్థంగా పనిచేస్తున్నాయి.
కోవిడ్ జాగ్రత్తలతో యాత్ర
కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటామంటున్నారు. మొదటిదశలో దాదాపు 40 రోజులు పూర్తిగా వెంట ఉంటామంటున్నారు. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో యాత్ర నిర్వహిస్తున్నాం. రెండు డోసుల టీకా తీసుకున్న వారికే ఈ యాత్రలో అవకాశం కల్పిస్తున్నాం.
నా భాషకు గురువు కేసీఆరే
నేను ఉపయోగించే భాషకు గురువు కేసీఆరే. ఆయన దగ్గర నేర్చుకున్న భాష కాబట్టి ఆయనకు ఆ తరహాలోనే సమాధానం చెబుతున్నాను. అప్పుడే ఆయనకు సరిగ్గా అర్థమౌతుంది. సీఎంగా కేసీఆర్ మాట్లాడే భాష తప్పు కానప్పుడు నేను మాట్లాడే భాష ఎలా తప్పు అవుతుంది ? గురుదక్షిణ కేసీఆర్‌కు భాష ద్వారా అప్పజెబుతున్నాను.
ప్రభుత్వ అవినీతిపై ఆధారాలున్నాయ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై మావద్ద పూర్తి ఆధారాలున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన సమయం లో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో పక్కాగా మా వ్యూహం మాకుంది. కేసీఆర్ విషయంలో కఠినంగా వ్యవహ రిస్తాం. చేసిన తప్పులకు తప్పకుండా జైలుకు పంపిస్తాం.
ప్రజలకు భరోసా ఇచ్చేందుకే..
ఓట్ల కోసమో, సీట్ల కోసమో యాత్ర చేపట్టడం లేదు. నిరంతరం ప్రజల్లో ఉంటూ భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన యాత్ర ఇది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి సమావేశంలో పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించాను. కోవిడ్ వల్ల ఏడాదిన్నరకు పైగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితి కొంత సానుకూలంగా ఉండటం, ఎన్నికలు లేనప్పుడే యాత్ర కొనసాగించాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభిస్తున్నాం. ఈ పాదయాత్ర దశల వారీగా 2023 వరకు కొనసాగుతుంది. తద్వారా ప్రజలు, కార్యకర్తలను కలుసుకుని రాజకీయపరంగా పార్టీని మరింత బలోపేతం చేస్తాం. సమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఒత్తిడి తెస్తాం.
Comments
Please login to add a commentAdd a comment