సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘‘రాహుల్‌గాంధీపై అన్యాయంగా అనర్హత వేటు వేశారు. ఆయనకు మద్దతుగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజు ఈ నెల 14న మంచిర్యాలలో ‘జై సత్యాగ్రహ’సభ నిర్వహిస్తున్నాం’’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలోని పాదయాత్ర క్యాంపులో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అనంతరం ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. తాత, నాన్నమ్మ తండ్రి ప్రధానులుగా పనిచేసినా, సొంతిల్లు కూడా లేని రాహుల్‌గాంధీ కావాలా? ప్రజల సంపదను దోచేస్తున్న మోదీ, కేసీఆర్ లాంటి వాళ్లు కావాలా? ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ, ముంపుపై అధ్యయనం చేస్తామని వెల్లడించారు. రూ.10వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించాలనుకున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ పెద్ద ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిందే ఉద్యోగాల కోస మైతే ప్రైవేటీకరణతో సింగరేణిలో ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారన్నారు.
హౌసింగ్ కార్పొరేషన్, దిల్ దక్కన్ భూములతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇ చ్చిన అసైన్డ్, మన్యం భూములు లాక్కొని ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని, చివరికి రాష్రాన్నీ అమ్మేలా ఉన్నారని ధ్వజమెత్తారు. బయ్యారం ప్లాంటుపై చిత్తశుద్ధి లేని కేసీఆర్ విశాఖ స్టీల్ కొనాలని వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ, ఆస్తులు అమ్మేస్తూ, విభజన హామీలపై ఏ ప్రకటన లేకుండా హైదరాబాద్ వచ్చి రాజకీయ ప్రసంగం చేసి వెళ్లాడని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం అవినీతిలో మునిగిందని చెప్పే ప్రధాని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ కన్వినర్ అజ్మతుల్లా, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, నాయకులు లోకేశ్ యాదవ్, విజయ్, శివకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment