
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాలు మద్దతు తెలిపాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన అఖిలపక్షభేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మాతో కలసివచ్చే పార్టీలను కోరడం జరిగింది. మా ప్రతిపాదనకు మీటింగ్‌లో పాల్గొన్న అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయి. పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నాయి. మాతో కలిసి వచ్చే పార్టీలే కాదు.. ఆ పార్టీల అనుబంధ సంఘాలు కూడా మాతో కలసి పని చేస్తాయి’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
(చదవండి: గుర్రపు బండిపై అసెంబ్లీకి..)
నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేస్తాం: చాడ వెంకట్ రెడ్డి.. సీపీఐ
కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు.. పోడు భూముల సమస్యపై పోరాటం ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాం అన్నారు సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేస్తాం. ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కేసీఆర్ విఫలం అయ్యాడు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలసి పనిచేయాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై మా పార్టీ లో చర్చించి మరోసారి సమావేశం అవుతాం’’ అని చాడ వెంకటరెడ్డి తెలిపారు.
చదవండి: విద్యార్థి, నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం: రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment