లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్‌తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది.
అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్‌పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్‌పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment