చకరక్కల్: సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు సైద్ధాంతికపరంగా అయోమయంలో పడ్డాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కేరళలో కత్తులు దూసుకుంటున్న ఈ రెండు పార్టీలు.. బెంగాల్‌లో కలిసికట్టుగా పోరాడుతుండటం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో గమనించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేరళలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సీకే పద్మనాభన్ తరఫున ఆయన శనివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ సీపీఎం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ బరిలో ఉన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ విషయమై వెల్లువెత్తిన ఆందోళనలను అణచివేసేందుకు అధికార సీపీఎం అణగదొక్కేందుకు యత్నించగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు.
ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హామీ ఇస్తోందన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో పోరాటం చేస్తోందని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన సీఎం విజయన్.. విచారణ అధికారులు ఆయన కార్యాలయానికి వెళ్లగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తోందంటూ ఎదురుదాడికి దిగారన్నారు. కేరళ ప్రజలు ప్రధాని మోదీ వెంటే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం కేరళకు భారీ ప్రాజెక్టులు మంజూరు చేసేలా తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment