
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేందుకు, దేశంలోనూ ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ నిమిత్తమే జీవో 111 రద్దుతో సీఎం కేసీఆర్ అక్రమ సంపాదనకు తెరలేపారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ వందిమాగధుల ఆస్తుల సంపాదనకు, ఆయనకు డబ్బులిచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. హైదరాబాద్ మహానగర పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసి, నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేసి, వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
భూముల్ని కాపాడాల్సిన వారే..
జీవో 111 పరిధిలో 18 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయని ఈటల చెప్పారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలు ఇవ్వలేదు కానీ.. హైదరాబాద్ శివార్లలో 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 5,800 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుని 300–400 గజాల ప్లాట్‌లు మాత్రం ఇస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములతో డబ్బులు సంపాదించవచ్చునని కేసీఆర్ గుర్తించడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు.
మియాపూర్ భూ కుంభకోణం ఏమైంది? కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ భూముల కేసు సర్కార్ ఎందుకు ఓడిపోయింది? అని ప్రశ్నించారు. చట్టాన్ని, భూములను కాపాడాల్సిన ప్రభుత్వం డబ్బులు ఉన్నవారికి కొమ్ము కాస్తూ కోర్టులలో కేసులు ఓడిపోతోందని ఆరోపించారు. భూముల ద్వారా సంపాదించిన డబ్బుల్నే పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు, తన లాంటి వారిని ఓడించేందుకు ఖర్చు పెడుతున్నారని, ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు ఒక్క గజం కూడా ఇవ్వడం లేదు..
కాళేశ్వరంలో నీళ్ళు ముందే నింపిపెడితే.. వర్షాకాలంలో వచ్చిన వరదలకు కాళేశ్వరం నుండి ఎల్లంపల్లి వరకు పొలాలు మునిగిపోయాయని ఈటల విమర్శించారు. జీవో 111 రద్దుతో జంట జలాశయాలను నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్ కూడా మునిగిపోతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం లక్షలాది ఇళ్లు నిర్మించి ఇస్తుంటే, కేసీఆర్ సర్కార్ మాత్రం డబుల్ బెడ్‌రూమ్‌లతో సహా, పేదలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్క గజం జాగా కూడా ఇవ్వడం లేదని చెప్పారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ధరణిలో తప్పులు సరిదిద్దేందుకు 18 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ పరిష్కారం లభించలేదని విమర్శించారు.
అధ్యక్షుడి మార్పు అధిష్టానం చూసుకుంటుంది
ఎన్నికల ఏడాదిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు ఈటల బదులిచ్చారు. బండి సంజయ్ తన శక్తి మేరకు పని చేస్తున్నారని, అయితే పార్టీ ఇంకా విస్తరించడంతో పాటు కొత్తవాళ్లు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో గెలవగానే కాంగ్రెస్ దేశమంతా గెలుస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ముందు తన పార్టీని, నాయకులను కాపాడుకోవాలని సూచించారు.