తెలంగాణ షిండే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి | BJP MLA Maheshwar Reddy Fires On Komatireddy Venkat Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ షిండే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Published Sun, Mar 31 2024 3:45 AM | Last Updated on Sun, Mar 31 2024 3:45 AM

BJP MLA Maheshwar Reddy Fires On Komatireddy Venkat Reddy - Sakshi

ఆయన, మరో ఐదుగురు మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారు 

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు 

కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీ వద్దకెళ్లి 

తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారు 

కానీ ఆయనపై నమ్మకం లేక వారు అంగీకరించలేదు 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదు.. వాళ్ల మంత్రులే కూల్చుతారు... ఇప్పటికే పది మంది సీఎం పదవిపై కన్నేశారు 

ఓటుకు కోట్లు కేసుతో తన సీటుకు ఎసరొస్తుందని రేవంత్‌ భయపడుతున్నారు 

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మరో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీల వద్దకు మంత్రి వెంకట్‌రెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారన్నారు. కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్‌తో ఆయన టచ్‌లో ఉంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనడం ఏమిటని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారు. వెంకట్‌రెడ్డితో ఆయన సోదరుడే టచ్‌లో లేరు. అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్‌లోకి వస్తారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదు. మా పార్టీ వారిని ముట్టుకునే సాహసం చేయొద్దు. మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజలు ఇచి్చన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా సహకరిస్తోంది. వెంకటరెడ్డికి దమ్ముంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యరి్థని గెలిపించుకోవాలి. 

భయపెట్టి వసూళ్లు చేస్తున్నారు 
రేవంత్‌రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరో విధంగా మాట్లాడటం సమంజసం కాదు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. రేవంత్‌ వసూళ్ల చిట్టా, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్‌ ట్యాక్స్‌ పేరిట రూ.3 వేల కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును దేశవ్యాప్తంగా రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వినియోగిస్తోంది. తుగ్లక్‌ చేష్టలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై మా పోరా టం కొనసాగుతుంది. కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వం. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఏదో ఒకఅంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇతర పారీ్టల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తున్నారు.’’అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాలు చేశాకే ఇతర పారీ్టల వారిని బీజేపీ చేర్చుకుంటోందన్నారు. 

వాళ్ల మంత్రులే కూల్చుతారు.. 
మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవడానికి 48 గంటలు కూడా పట్టదు. కానీ మేం అలా చేయబోం. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ల మంత్రులే కూల్చుతారు. ఇప్పటికే పది మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారు. ఓటుకు కోట్లు కేసుతోనో, ఇంకో అంశంతోనో తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌కు నిద్రపట్టడం లేదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి. గతంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనకు టికెట్‌ ఎలా ఇచ్చారు? ఆయన తరఫున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయటపెట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement