![Minister Komatireddy Venkat Reddy counter to Maheswar Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/31/KOMATIREDDY%20VENKAT%20%202.jpg.webp?itok=_zIaKAJT)
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్
‘కాంగ్రెస్‌లో చేరుతా సాయం చేయాల’ని ఏలేటి నన్ను అడిగారు
ఇప్పుడు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు..
భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దాం.. రావాలని సవాల్
మహేశ్వర్‌రెడ్డి జోకర్ అని, మతిస్థిమితం తప్పినట్టుందని వ్యాఖ్యలు
దేశంలోనే అత్యంత దిగజారిన పార్టీ బీజేపీ అని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని.. ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తి తన గురించి మాట్లాడటమేమిటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ‘కాంగ్రెస్‌లో చేరుతా.. సాయపడు అన్నా’అని మహేశ్వర్‌రెడ్డి తనను కోరారని.. అలాంటిది ఇప్పుడు తనను టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఓ రాజకీయ జోకర్ అని వ్యాఖ్యానించారు. శనివారం తనపై మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘కాంగ్రెస్‌లోకి వస్తా.. మంత్రి పదవి కావాలన్నా అని అసెంబ్లీ సమావేశాల సమయంలో మహేశ్వర్‌రెడ్డి నన్ను అడిగారు. మాకే పూర్తి మెజారిటీ ఉంది. ఎవరినీ చేర్చుకునే ఉద్దేశం లేదని చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్రంతో ఆరుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారంటూనే.. తమకు అవసరం లేదనడం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే ఏక్‌నాథ్ షిండే పాత్ర పోషిస్తారనడం మహేశ్వర్‌రెడ్డికి మతిస్థిమితం లేదనడానికి నిదర్శనం. గడ్కరీ, అమిత్ షాలను తాను కలసి షిండే పాత్ర పోషిస్తానని చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై భాగ్యలక్ష్మి ఆయానికి వారిని తీసుకుని వచ్చి ప్రమాణం చేయాలి. నేను కూడా ప్రమాణం చేస్తా..
బీజేపీతో లాభం లేదన్నారు..
‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తమ (బీజేపీ)వాళ్లు రామ మందిరాన్ని పట్టుకున్నారని... దానితో తెలంగాణలో ఓట్లు పడతాయా’అని మహేశ్వర్‌రెడ్డి నాతో చెప్పారు. తాను సొంత ఇమేజీతో ఎమ్మెల్యేగా గెలిచానని, బీజేపీతో లాభమేమీ లేదని కూడా అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండుంటే మంత్రిని అయ్యేవాడిననీ చెప్పారు. నేను షిండే అవునో, కాదో తెలియదుగానీ.. మహేశ్వర్‌రెడ్డి మాత్రం కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దనరెడ్డి లాంటివారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. నేను కాంగ్రెస్‌లోనే పుట్టా.. కాంగ్రెస్‌లోనే పోతా...
దిగజారుడు పార్టీ బీజేపీ..
ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. చేరికల కమిటీకి చైర్మన్‌ను కూడా నియమించారు. అయినా ఒక్క కార్పొరేటర్ కూడా ఆ పారీ్టలో చేరలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు పంపుతున్నారని ఇష్టమొచి్చనట్టు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు మోదీకి, నడ్డాకు డబ్బు పంపుతున్నారా? దేశాన్ని అదానీ, అంబానీలకు దోచిపెట్టిన బీజేపీ ఇతరులను విమర్శించడం సిగ్గుచేటు. నిజానికి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ. ఆ పార్టీకి తెలంగాణ ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేదు. సోనియాగాంధీ పారీ్టకి నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు.’’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment