సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ (అవినీతి) రిష్వత్ (లంచగొండి) సమితి.. కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోంది..వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ కుటుంబపాలన అంతం కావడం ఖాయం. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఎన్నో పథకాలు ఇక్కడ అమలు కాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుంటోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కేసీఆర్ నెరవేర్చలేదు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పేదలకు సింగిల్ బెడ్రూం గతి లేదు.. కానీ బీఆర్‌ఎస్ నేతలు డబుల్ బెడ్రూం అంటున్నారని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో బీజేపీ గెలవాలి. దీంతోపాటు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి’ అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో సర్వశక్తులూ ఒడ్డి పోరాడి కేసీఆర్ కుటుంబపాలనను అంతం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు.
ప్రతీ ఇంట్లో కమలం వికసించేలా కృషి చేయాలి..
‘ప్రతీ ఇంట్లో కమలం వికసించేలా కృషి చేయాలని నడ్డా కోరారు. కాంగ్రెస్ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించింది. ఆ పార్టీ కూడా సోనియాగాంధీ ఆ తర్వాత రాహుల్‌గాంధీ వారసుల కుటుంబపార్టీగా మారింది. దీంతో కశ్మీర్, పంజాబ్ మొదలుకొని తమిళనాడు, తెలంగాణ దాకా ప్రాంతీయపార్టీలు ఏర్పడ్డాక కుటుంబ పార్టీలుగా రూపాంతరం చెంది ప్రజల ఆకాంక్షలను విస్మరించాయి. కేసీఆర్, కేటీఆర్, కూతురు, అల్లుడు, వారే ఉంటారు. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా..వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయని చెప్పారు.
9 ఏళ్లలో ఎంతో చేశాం...
మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందని నడ్డా చెప్పారు. ‘తెలంగాణ వికాసం కోసం కేంద్రం 9 ఏళ్లలో రూ.9 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణలో 2 కోట్లమంది పేదలకు కేంద్రం రేషన్ ఇస్తోంది. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదు. ప్రధాని ఆవాస్ యోజన కింద దేశవ్యాç³్తంగా 4 కోట్ల ఇళ్లు కేంద్రం నిర్మించింది. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించింది’ అని ప్రశ్నించారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందని నడ్డా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment