బరిలోకి మైసూరు మహారాజు.. సిట్టింగ్‌ ఎంపీకి బీజేపీ షాక్‌ | BJP: Pratap Simha Dropped Yaduveer Wadiyar To Contest From Mysuru | Sakshi
Sakshi News home page

బరిలోకి మైసూరు మహారాజు.. సిట్టింగ్‌ ఎంపీకి బీజేపీ షాక్‌

Published Wed, Mar 13 2024 9:15 PM | Last Updated on Thu, Mar 14 2024 11:23 AM

BJP: Pratap Simha Dropped Yaduveer Wadiyar To Contest From Mysuru - Sakshi

బెంగళూరు: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. తొలి జాబితాలో దేవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా.. నేటి జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కలిపించింది.  ఇక ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండు లిస్ట్‌లు కలిపి ఇప్పటి వరకు మొత్తం 267 స్థానాలకు అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. 

ఇక తాజా లిస్ట్‌లో కర్ణాటకలోని మైసూర్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ ప్రతాప్‌ సింహాకు బీజేపీ షాక్‌ ఇచ్చింది. మైసూరు రాజ వంశీయుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజను బరిలోకి దింపింది. గతేడాది పార్లమెంట్‌లో జరిగిన భద్రతా వైఫల్యం వివాదంలో మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహా కేంద్రబిందువుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ కేసులో నిందితులిద్దరూ మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహా ద్వారానే విజిటర్స్‌ పాస్‌లు పొందినట్లు అధికారులు గుర్తించారు. 
చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు వీళ్లే

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని, ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ ప్రతాప్‌ సింహాకు టికెట్‌ నిరాకరించినట్లు సమాచారం. 

ఇక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్‌ ఇవ్వకుంటే తన మద్దతుదారులు, అభిమానులు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని ఈ రోజు ఉదయమే మైసూర్‌ ఎంపీ కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రధాని మోదీనే కారణమని.. ఆయనకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మోదీ కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అంతేగాక బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే మైసూర్ రాజ వంశాన్ని సింహా అభినందించారు. మహారాజా యదువీర్‌కి అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement