బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని స్పష్టీకరణ
సభ్యత్వ నమోదుపై సమీక్ష.. 50 లక్షలకుపైగా సభ్యత్వాలకు కృషి చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే సభ్యత్వ నమోదును కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే లా కృషి చేయాలని సూచించారు. శనివారం బేగంపేటలోని ఓ హోటల్‌లో సభ్యత్వ నమోదుపై సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో నడ్డా సమావేశమయ్యారు.
అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానే పార్టీ పరిగణిస్తోందని చెప్పారు. అందువల్ల ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా పార్టీ పటిష్టానికి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల మందిని సభ్యులుగా చేర్చారని.. అక్టోబర్ 15 వరకు చేపడుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా 50 లక్షల మందికిపైగా సభ్యులను చేరి్పంచేలా కృషి చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు రావడంతోపాటు 8 ఎంపీ సీట్లు గెలిచినందున... పడిన ఓట్లలో 75 శాతం మందిని పార్టీ సభ్యులుగా చేర్పించడం పెద్ద కష్టమేమి కాకూడదన్నారు.
అత్యధిక సభ్యత్వాలను చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టానికి చేపడుతున్న చర్యలను గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని చేయనందున ఈ నెల 30న పార్టీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన పేరిట దీక్ష నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించారు.
ఈ సమావేశం ముగిశాక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని నడ్డా ప్రశంసించారన్నారు. నడ్డాతో భేటీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగే‹Ù, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment