సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ రాష్ట్రంలో కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 25 నుంచి 30 సీట్లలో బీజేపీ నిర్ణయాత్మకంగా వ్యవహరించడంతో పాటు వాటిలో అధిక స్థానాలు గెలుచుకోవడంపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ స్థానాల్లో పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదంతోపాటు కీలక స్థానాల్లో ప్రచారం చివరి రోజుల్లో అగ్రనేతల విస్తృత ప్రచారం పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి వస్తుందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆయా వర్గాల ఓట్లు చీలితే పలుచోట్ల బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
అగ్రనేతలంతా ఇక్కడే...
ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ముఖ్య నేతలు విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హైదరాబాద్‌లోనే మకాం వేసి సంస్థాగతంగా పార్టీ యంత్రాంగం ఏ మేరకు ఎన్నికల యాజమాన్య నిర్వహణ చేస్తోందో లోతుగా సమీక్షిస్తున్నారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్, జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్, రాష్ట్ర సహ ఇన్‌చార్జి అర్వింద్ మీనన్‌తో సంతోష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యనేతను ఇన్‌చార్జిగా నియమించి, పోలింగ్ ముగిసేదాకా అన్ని అంశాలను సమన్వయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
ప్రధాని సుడిగాలి పర్యటనపై ఆశలు
ప్రచారపర్వం ముగిసేలోగా పీఎం మోదీ వరుసగా మూడురోజులు...ఆరుసభల్లో పాల్గొనడంతో పాటు చివర్లో హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. 25న కామారెడ్డి (కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ) నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), రంగారెడ్డి జిల్లా(మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి,), 26న తూఫ్రాన్ (గజ్వేల్, దుబ్బాక, మేడ్చల్, మెదక్, నరసాపురం), నిర్మల్ (నిర్మల్, ముథోల్, బాల్కొండ, ఖానాపూర్), 27న మహబూబాబాద్ (మహబూబాబాద్, ములుగు, తదితర ఎస్టీ స్థానాలు) కరీంనగర్ (కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, కోరుట్ల) ఇలా ఆయా ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలోని వివిధ వర్గాల ఓటర్లపై ప్రభావం చూపేలా మోదీ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
బీసీ, ఎస్సీల అండపై అంచనాలు..ఎస్టీలకు హామీ?
అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ పార్టీలకు చెక్ పెట్టేలా బీసీ నేతను సీఎంను చేస్తామన్న ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాస్త అలస్యంగా ప్రకటించినా..ఈ నినాదాన్ని బీజేపీ తన ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోగలిగింది.
బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ ఉపకులాల వారీగా రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ మద్దతు ప్రకటన మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామనే హామీ కూడా బీజేపీ నేతలు త్వరలోనే ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఓ అంచనా ప్రకారం బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు...
♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని... ముథోల్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్
♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), ఆర్మూరు, జుక్కల్
♦ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్ల, మానకొండూరు
♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో... వరంగల్ (ఈస్ట్), పరకాల, ములుగు, మహబూబాబాద్
♦ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో... మహేశ్వరం, ఎల్‌బీనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి,
♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో... కల్వకుర్తి, మహబూబ్‌నగర్, మక్తల్
♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో... దుబ్బాక, పటాన్ చెరు, నరసాపూర్,
♦ నల్లగొండ జిల్లాలో... సూర్యాపేట, మునుగోడు
♦ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో... గోషామహల్. అంబర్‌పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి
Comments
Please login to add a commentAdd a comment