సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. దీంతో రాజధాని హైదరాబాద్‌లో పార్టీల అగ్రనేతల ప్రచారం ఊపందుకుంది. ఒక్కసారిగా సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు పెరిగిపోవడంతో నగరంలో సామాన్య జనాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సోమవారం సాయంత్రం నగరంలో వీఐపీల ప్రచార టూర్‌లు ఎక్కువగా ఉండడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు హైదరాబాద్‌లోని ప్రధాన రూట్‌లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రోడ్డు, సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వెళ్లే రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక కిలో మీటర్ దూరం వెళ్లడానికి సుమారు గంట సమయంపైగా పట్టడంతో విసుగు చెందిన నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీఐపీలు సాధారణంగా జెడ్ ప్లస్ లేదా ఆ పై స్థాయి సెక్యూరిటీ భద్రతలో ఉంటారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం వారి కాన్వాయ్ వెళ్లేందుకు రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు నగరంలో పీక్ అవర్స్ ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ను ఆపేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురవుతోంది. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఆపడం కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు.
గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో వీఐపీల పర్యటనలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులకు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుండడంతో ఉపశమనం లభించనుంది. గురువారం(నవంబర్ 30) న పోలింగ్ ఉండడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 48 గంటల ముందే పచారం ఆపాల్సి ఉంటుంది. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూతపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment