సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సవాల్ చేశారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమై కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో కేంద్రం భాగస్వామ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చేందుకు ఈనెల 12న వస్తున్న ప్రధాని మోదీ పర్యటనలో సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు కేసీఆర్, ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణపై మోదీ కొత్త నాటకం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రధాని మోదీ కొత్త నాటకం ఆడుతున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంపై ఏ విధంగా పగ తీర్చుకోవాలన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఏడాదిగా పనిచేస్తున్న ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని వస్తుంటే.. ప్రొటోకాల్ పాటించని దుస్థితికి కేంద్ర ప్రభుత్వం చేరిందని విమర్శించారు.
ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఎంపీ బడుగుల బుధవారం మీడియా తో మాట్లాడారు. రామగుండం వస్తున్న ప్రధాని మోదీ.. ముందుగా తెలంగాణకు ఏమివ్వనున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా కేంద్రానికి రాష్ట్రం పన్నుల ఆదాయం పంపితే... తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. విభజన హామీల అమలు విషయంలోనూ ఎలాంటి పురోగతి లేదని.. కృష్ణా, గోదావరి నీటి సమస్యలు ఇంకా పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉన్నందున నెలరోజుల్లోనే రూ.లక్ష కోట్లకు పైగా గుజరాత్‌కు ఇచ్చారని ఆరోపించారు. మోదీ కేవలం గుజరాత్‌కే ప్రధానా? లేక దేశం మొత్తానికా? అని ప్రశ్నించారు. కేంద్రం... బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో రకంగా ట్రీట్ చేస్తోందని మండిపడ్డారు. ప్రధానికి ఏనాడూ తెలంగాణ మీద ప్రేమ లేదని లింగయ్య యాదవ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment