కె. రాహుల్: తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం ద్వారా బీసీ ఎజెండాతో బీజేపీ ఎన్నికల గోదాలోకి దిగుతున్న విషయం స్పష్టమైంది. గత కొంతకాలంగా ఆ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం పెంచుతున్న నేపథ్యంలో బీసీ సీఎంపై కూడా పార్టీ అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అటు అధికార బీఆర్‌ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో బీజేపీకి ఇప్పుడు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది.
కచ్చితమైన వ్యూహంతో ముందుకు..
కచ్చితమైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయంలో భాగంగానే అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం అంత బలంగా ఎత్తుకోని బీసీ నినాదాన్ని బీజేపీ తలకెత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. తాజాగా ఈ నిర్ణయాన్ని సూర్యాపేట సభలో అమిత్‌షా ప్రకటించడానికి ముందే సంస్థాగతంగా పార్టీలో వివిధ స్థాయిల్లో చర్చించి, ముఖ్యనేతలు, రాష్ట్రకార్యవర్గం, కౌన్సిల్ సభ్యుల స్థాయిలో అభిప్రాయసేకరణ చేపట్టారు.
ఈ భేటీల్లోనూ రెడ్డి, ఇతర సామాజికవర్గనేతల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో బీసీ ఎజెండాతోనే ముందుకెళితేనే మంచి ఫలితాలు సాధించవచ్చుననే నిశ్చితాభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభాలో 54 శాతం వరకు బీసీ వర్గాల వారు ఉన్నారనే అంచనాల నేపథ్యంలో అధికశాతం బీసీల ఓట్లు బీజేపీ ఖాతాలో పడేందుకు బీసీ సీఎం నినాదం పనిచేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో బీసీ ఎజెండాతో ఇతర సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా తగిన జాగ్రత్తలూ తీసుకోవాలని నిర్ణయించింది.
విస్తృత ప్రచారంతో... వారిని చేరుకోవడమే కీలకం
2014 అసెంబీ ఎన్నికల్లో టీడీపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నా అది అస్సలు వర్కవుట్ కాలేదు. సీనియర్‌నేత టి దేవేందర్‌గౌడ్ కూడా బీసీల కోసం పార్టీ పెట్టినా ఈ వర్గాల నుంచి పెద్దగా మద్దతు కూడగట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బీసీ సీఎం ఎజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, ఎంబీసీ కులాల పెద్దలు, నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. బీసీ సీఎం అభ్యర్థిని ఎవరన్నది కూడా త్వరలో ప్రకటించే యోచనలో బీజేపీ ఉంది.
40కి పైగా సీట్లు ఇచ్చేలా..
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40కి పైగానే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేలా నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం సీట్లలో మూడోవంతుకు పైగానే సీట్లు ఇచ్చామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తొలిజాబితాను 52 మంది అభ్యర్థులతో విడుదల చేయగా, అందులో బీసీవర్గాలకు చెందిన వారికి 19 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో ఒకరికి, తాజాగా 35 మందితో మూడో జాబితాను ప్రకటించగా అందులో 13 మంది బీసీలకు టికెట్లు కేటాయించారు.
మొత్తంగా చూస్తే.. ప్రకటించిన 88 సీట్లలో 32 మంది బీసీ వర్గాలకు వచ్చారు. ఇంకా 31 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, జనసేనకు 11 సీట్లు కేటాయిస్తే.. మిగిలిన 20 సీట్లలో పదిదాకా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఆయా కులాల వారీగా చూస్తే ముదిరాజ్–గంగపుత్రులు కలిపి (45 లక్షలు) యాదవ (35 లక్షలు), గౌడ (28 లక్షలు), మున్నూరుకాపు (22 లక్షలు), పద్మశాలి (18 లక్షలు),రజక (12 లక్షలు ),వడ్డెర (10 లక్షలు), ఇతర ఎంబీసీ కులాలకు చెందిన వారు 40 లక్షలదాకా ఉండొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా కులాల వారీగా టికెట్లు కేటాయిపునకు కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని మోదీ పథకాలతో..
జాతీయస్థాయిలో బీజేపీ తీసుకున్న ‘సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో బీసీలు, ఎంబీసీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తే మంచి ఫలితాలను సాధించొచ్చునని భావిస్తున్నారు. మోదీ హయాంలో ఆయా బీసీవర్గాలకు అందిన ప్రయోజనాలను వివరించనున్నారు.
ఎంబీసీ వర్గానికి చెందిన మోదీని బీజేపీ తొలిసారిగా ప్రధానిగా నియమించడం, కేంద్ర కేబినెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 27 మంది వెనుకబడిన తరగతుల వారి నియామకం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీవర్గాల వారికి కూడా అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం... ఈ పరిణామాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం, ఆనవాయితీ బీజేపీలో లేకపోయినా తెలంగాణలో ఈ సారి ముందుగానే బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment