
సాక్షి, అమరావతి: ‘మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు ఎన్నికలు కావాలి. ఎన్నికలు వస్తే ఏదో అయిపోతానని ఆయన కలలు కంటున్నాడు. ఏమీ కాడు. ఇప్పుడు కొంతైనా ఆశతో బతుకుతున్నాyý ు. ఎన్నికల తర్వాత అదీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్నన్ని సీట్లు కూడా ఆ పార్టీకి రావు. వాపును చూసి బలుపనుకుంటున్నాడు. ఎన్నికలయ్యాక చంద్రబాబు తుస్సుమంటాడు’ అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాలన, అధికార వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుందన్నది తమ పార్టీ విధానమని చెప్పారు.
తమ పార్టీ తొలి నుంచీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, ఎప్పుడైనా తమది అదే నినాదమని స్పష్టం చేశారు. రేపటి నుంచే మూడు రాజధానులు అమల్లోకి రావాలన్నది తన డిమాండ్ అని, ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని న్యాయ పరమైన చిక్కుల వల్ల విశాఖ నుంచి పాలన ఆలస్యమవుతోందన్నారు. టీడీపీ, కొన్ని దుష్ట శక్తులే మూడు రాజధానుల ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని.. తుదకు న్యాయం, నిజమే గెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల నినాదం వినిపిస్తామని చెప్పారు. కర్నూలు న్యాయ రాజధానిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాము చట్టం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే..
మా ప్రభుత్వంపై పెరిగిన నమ్మకం
అమరావతిలో ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటి? టెంట్లు వేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమా? అక్కడ ఒకరిద్దరు రైతులు తప్ప మిగతా వారంతా చంద్రబాబు బినామీలు. బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం? మా పార్టీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలవి.
అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని, జాతి సంపదను గోతుల్లో పోయమంటే ఎలా? అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామంటే అభ్యంతరం ఎందుకు? పేదలు, సామాన్యులు అక్కడ ఉండకూడదనడం ఎంత వరకు సబబు?
దేశ చరిత్రలో ఎక్కడా లేనంతగా క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మా ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం, భరోసా పెరిగింది. వారి ఆర్థిక పరిస్థితులు బాగు పడుతున్నాయి. ఇలాంటప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆతృత మా పార్టీకి ఎందుకు ఉంటుంది?
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా. ఓటమిపై పరిశీలన చేసుకొని, లోటుపాట్లుంటే సరి చేసుకుంటాం.
దశాబ్దాలుగా మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతోంది. ఇన్నాళ్లూ దాని యాజమాన్యం తప్పించుకుంది. ప్రస్తుతం మరిన్ని అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు.
Comments
Please login to add a commentAdd a comment