Botsa Satyanarayana Comments Over Free House Scheme In AP - Sakshi
Sakshi News home page

ఇది బలవంతపు పథకం కాదు: బొత్స సత్యనారాయణ

Published Wed, Dec 1 2021 4:39 PM | Last Updated on Thu, Dec 2 2021 3:22 AM

Botsa Satyanarayana Comments Over Free House Scheme In AP - Sakshi

2000 సంవత్సరం నుంచి ఉన్న ఈ పథకంలో గతంలో వడ్డీ మాత్రమే మాఫీ అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు వడ్డీ మాఫీ కూడా అమలు జరగలేదు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ప్రజలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఉన్న ఒక్క ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంను కూడా నిలిపివేశారంటూ వారి కష్టాలను ఏకరవు పెట్టారు. వడ్డీల వల్ల చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప.. విక్రయ హక్కు, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని తెలిసిన జగన్‌ చలించిపోయారు. ఓటీఎస్‌కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టారు.     
– మంత్రి బొత్స

సాక్షి, అమరావతి: పేదల పక్కా ఇళ్లను వారి సొంతం చేయడానికి, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆస్తి ఉపయోగపడటానికే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని (వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్, ఓటిఎస్‌) ప్రభుత్వం తీసుకొచ్చిందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. నిర్ణీత రుసుము చెల్లించి, ముందుకొచ్చిన వారికే ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ చేస్తారని, ఎవరిపైనా ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఇంటి పట్టా శాశ్వత హక్కుదారుడిగా బ్యాంకుల్లో రుణం పొందడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి, చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చారని చెప్పారు.

లబ్ధిదారుల రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా.. వారికి పూర్తి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేలుతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఓటీఎస్‌ అన్నది ఎవరినీ బలవంతం చేయడానికో, లేక షరతులు విధించడానికో కాదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్‌ ఇచ్చిన సర్క్యులర్‌కు, ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని, అతన్ని సస్పెండ్‌ చేశామని పేర్కొన్నారు. ఓటీఎస్‌పై అధికారులు ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ పూర్తి అవగాహన వచ్చేలా ఈ పథకం గురించి వివరించాలని కార్యదర్శులకు చెప్పామన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు లాభపడాలని కోరారు.
 
మేలు చేసే పథకంపై పనిగట్టుకొని దుష్ప్రచారం
ప్రజలకు మేలు చేసే ఇటువంటి మంచి పథకంపైన ప్రతిపక్షం చిల్లర విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడిపై రాజకీయాలు చేసే పార్టీలకు, వ్యక్తులకు పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు. పేదవాడిపై టీడీపీకి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లను ఫ్రీగా ఇస్తామని, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్‌ను తిరస్కరించిన బాబు.. ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానంటే ఎవరు నమ్ముతారని అన్నారు.

14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఏమీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సోదరీమణులను ఏ విధంగా మోసం, దగా చేశారో అందరికీ తెలుసన్నారు. కాబట్టే టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలవారికీ సముచిత స్థానం ఉందని తెలిపారు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.  రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తోందని, లక్షా 50 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.

వడ్డీ మాఫీకి కూడా బాబు సర్కారుకు మనసే రాలేదు
‘వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం  2000 జనవరి 24న ప్రారంభమైంది. వడ్డీని మాత్రమే అప్పటి ప్రభుత్వాలు మాఫీ చేసేవి. తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే తనఖా పెట్టుకున్న పత్రాన్ని లబ్ధిదారునికి ఇచ్చేవారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు. 2014 మార్చి ఆఖరు వరకు.. అంటే  14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది ఈ స్కీంను వినియోగించుకున్నారు. 2014 ఏప్రిల్‌ నుంచి 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే వరకు పథకం అమలు కాలేదు. ఈ ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం ఉంది. 2016 సెస్టెంబర్‌ 30న జరిగిన ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ బోర్డు మీటింగ్‌లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంను పొడిగించాలని ప్రతిపాదన పంపారు. 2016 అక్టోబర్‌ 27,, 2016 నవంబర్‌ 3న, 2018 ఏప్రిల్‌ 10న,  2019 ఫిబ్రవరి 13న మరో నాలుగు దఫాలు స్కీం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 5 సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రతిసారీ ఏదో ఒక నెపంతో వాటిని వెనక్కి పంపింది. ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణ మాఫీ సంగతి దేవుడెరుగు.. వడ్డీ మాఫీకి కూడా మనసు రాలేదు. 14 ఏళ్లుగా అమల్లో ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు’ అని బొత్స చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement